Rawat asked water: భరతమాతకు నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఓ వ్యక్తి.. తన చివరి క్షణాల్లో తాగడానికి గుక్కెడు నీళ్లందని స్థితిలో మరణించారా? హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మంటల్లో చిక్కుకున్న తర్వాత కొంతసేపు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలతోనే ఉన్నారని, తాగడానికి నీళ్లు కావాలని అడిగారని ప్రమాద ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొందరు చెబుతున్నారు. తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పలు విషయాలు బయటపడుతున్నాయి.
నిజం తెలిసి నిద్ర పట్టలేదు
Eyewitness cds helicopter crash: సహాయక చర్యల్లో పలువురు స్థానికులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఘటనపై శివకుమార్ అనే గుత్తేదారు మీడియాతో పలు కీలక విషయాలు వెల్లడించారు.
"హెలికాప్టర్ మంటల్లో చిక్కుకుని కుప్పకూలడాన్ని చూడగానే మేం పరుగున అక్కడికి వెళ్లాం. అక్కడ ముగ్గురు పడి ఉన్నారు. వారిలో ఒకరు కొన ప్రాణాలతో ఉన్నారు. ఆయన నన్ను తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. ఆయనను ఓ దుప్పటి మీదకు లాగాం. సహాయక చర్యల్లో ఉన్నవాళ్లు ఆయన్ను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు. 3 గంటల తర్వాత ఓ పోలీసు అధికారి వచ్చి.. నాకు ఓ ఫొటో చూపించారు. 'ఇందాక నిన్ను మంచినీళ్లు అడిగింది ఈయనే. ఈయన జనరల్ బిపిన్ రావత్.. భారత త్రిదళాధిపతి' అని చెప్పారు. దేశానికి రక్షణగా నిలిచిన ఓ గొప్ప వ్యక్తి తాగడానికి నీరు అందని స్థితిలో ఉండటం చూసి చలించిపోయాను. దాంతో రాత్రంతా నిద్ర పట్టలేదు"
-శివకుమార్, గుత్తేదారు.
ఆయన రావత్ అని తెలియదు
Cds helicopter crash: "ప్రమాదం జరగ్గానే అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిశాయి. స్థానికులు, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, పలువురు సైనికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరగ్గానే ముగ్గురు వ్యక్తులు మంటల్లోనే అటూ ఇటూ పరుగులు పెట్టడం స్థానికులు గమనించారు. దట్టంగా మంటలు ఉండటం వల్ల దగ్గరికి వెళ్లలేకపోయారు. అగ్నిమాపక అధికారులు మంటల్ని నియంత్రించిన తర్వాత ఇద్దరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారన్నారు. వారెవరో అప్పటికి స్పష్టంగా తెలియలేదు. తర్వాత వారు బిపిన్ రావత్, వరుణ్‌సింగ్ అని తెలిసింది" అని స్థానికులు చెబుతున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో రావత్ హిందీలో తన పేరు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆసుపత్రికి వెళ్లేలోపే మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: