CDS Chopper Crash: భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ ఘటనకు ప్రతికూల వాతావరణం కారణంగా ఏర్పడే కంట్రోల్డ్ ఫ్లైట్ ఇన్‌టూ టెర్రెయిన్నే (సీఎఫ్ఐటీ) ప్రధాన కారణంగా గుర్తించినట్లు వెల్లడైంది.
chopper crash inquiry report: ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేరింది. ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి, ఎయిర్ మార్షల్ మానవీంద్ర సింగ్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తునకు సంబంధించిన విషయాలను కేంద్రమంత్రికి బుధవారం వివరించారు. ముఖ్యంగా హెలికాప్టర్‌లో ఎటువంటి సాంకేతిక లోపం, విద్రోహ చర్య జరిగే వీలులేదని దర్యాప్తు బృందం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, తాజా నివేదికపై మాత్రం ఇప్పటివరకు అటు ప్రభుత్వం నుంచి కానీ, భారత వాయుసేన నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.
What is Controlled flight into terrain
ప్రతికూల వాతావరణం లేదా పైలట్ తప్పిదం కారణంగా నియంత్రణలో ఉన్న విమానం నేల, నీరు లేదా ఏదైనా ఎత్తైన ప్రదేశంపై కూలిపోవడాన్ని సీఎఫ్ఐటీగా పరిగణిస్తారు. విమానం ల్యాండింగ్ సమయంలో లేదా ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే సీఎఫ్ఐటీ సంభవిస్తుందని వైమానికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రకారం, విమానం నియంత్రణ కోల్పోతున్నట్లు ఎలాంటి సూచనలు లేకుండా ఎత్తైన ప్రదేశం, నీరు, భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని సీఎఫ్ఐటీ సూచిస్తుంది.
ప్రమాదం ఇలా..
తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో 2021 డిసెంబరు 8 హెలికాప్టర్ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి: మోదీ ర్యాలీ రద్దుపై మాటల యుద్ధం.. 'ఫ్లాప్ షో అని తెలిసే ఇలా..'