పదో తరగతి పరీక్షలకు మార్కుల మదింపు విధానాన్ని సీబీఎస్‌ఈ ఖరారు చేసింది. ఫలితాలు జూన్20లోపు విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.
బోర్డు కొత్త విధానం ప్రకారం.. ప్రతి సబ్జెక్టుకు వంద మార్కులుంటాయి. అందులో ఇంటర్నల్(అంతర్గత) మార్కులు 20. మిగతా 80 మార్కులు సంవత్సరంలో జరిగిన వివిధ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉంటాయి.
ఫలితాలను ఖరారు చేయడానికి ప్రిన్సిపల్, ఏడుగురు ఉపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేయాలని పాఠశాలలను బోర్డు కోరింది. సొంత పాఠశాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు(గణితం, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, రెండు భాషలకు చెందినవారు) కమిటీలో ఉండాలని తెలిపింది. పొరుగు పాఠశాలలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను కమిటీ.. బాహ్య సభ్యులుగా నియమించుకోవాలని స్పష్టం చేసింది. మార్కుల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
కరోనా తీవ్రత కారణంగా సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను బోర్డు రద్దు చేసింది.