కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పనితీరు పట్ల సుప్రీంకోర్టు (cbi supreme court) అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ కేసులు (cbi cases) కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. కేసుల విచారణపై దర్యాప్తు సంస్థ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికింది. సీబీఐ ఇప్పటికీ పంజరంలో చిలకలాగే వ్యవహరిస్తోందని, ఆ చిలకకు స్వేచ్ఛ కావాలంటూ గతంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది.
షోపియాన్ జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురైన ఘటనలో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడంతో పాటు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై జమ్ము కశ్మీర్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
"సీబీఐ నమోదు చేసే కేసుల్లో విజయాల శాతం తక్కువగా ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఇప్పటివరకు మీరు(సీబీఐ) ఎన్ని కేసులు పెట్టారు. వాటిల్లో ఎన్ని నిరూపించారు. ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి" అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ సందర్భంగా సీబీఐపై గతంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. దర్యాప్తు సంస్థ 'పంజరంలో చిలక' మాదిరిగానే ఉందన్న హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన ధర్మాసనం.. ఆ చిలకకు స్వేచ్ఛ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అంతేగాక, సీబీఐ దర్యాప్తులో సమస్యలను తమ దృష్టికి తేవాలని కోర్టు సూచించింది. సిబ్బంది, వసతుల లేమి ఉంటే చెప్పాలని ఆదేశించింది. దీనిపై ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఇటీవల ఆదేశించిన కోర్టు.. సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: భారత్ అధ్యక్షతన గురువారం బ్రిక్స్ సదస్సు