సాధారణంగా పిల్లుల కంటే కుక్కలను చూస్తేనే భయం వేస్తుంది. కుక్క కాటుకు గురైన సంఘటనలే ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. కేరళ ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. మనుషులపై దాడి చేసి గాయపరచటంలో శునకాలను వెనక్కి నెట్టాయి మార్జాలాలు. అక్కడ కుక్క కాటు కంటే పిల్లి కాటుకు గురై చికిత్స పొందుతున్నవారే ఎక్కువ. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఒక్క జనవరిలోనే 28,186 మంది పిల్లి కాటుకు గురైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్ర యానిమల్ లీగల్ ఫోర్స్.. సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా.. ఈ విషయం బయటపడింది.
ఆరేళ్లలో 128 శాతం పెరుగుదల
2013-2021 మధ్య కుక్క, పిల్లి కాటుకు గురైన వ్యక్తుల గణాంకాలతో పాటు ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం వ్యయం చేసిన మొత్తాన్ని జత చేసింది ప్రభుత్వం. సమాచారం కోరిన ఏడాదిలో 1,35,217 మంది కుక్క కాటుకు, 1,60,534 పిల్లి దాడికి గురైనట్లు అందులో పేర్కొంది. 2016 నుంచి పిల్లి కాటుకు గురైన వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. 2014-2020 మధ్య పిల్లి కాటుకు గురైనవారు 128 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: Cowin పోర్టల్ హ్యాక్ అయిందా?