Cat Suspicious death complaint to Police: చూడముచ్చట గొలిపే తెల్లని పర్షియన్ జాతి పిల్లి అది. పుట్టిన రోజు బహుమతిగా తమ ఇంటికి రావడంతో దానికంటూ ప్రత్యేకంగా ఆహారం కూడా పెడుతూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు యజమానులు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అప్పటికే కనిపించకుండా పోయిన ఆ పిల్లి వీధిలో చనిపోయి కనిపించింది. దీంతో దాని యజమాని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పక్కింటి వారే తమ పిల్లిని చంపేసి ఉండొచ్చని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోడ్డుపై మృతదేహం..: అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లిని.. ఇంటి ఆవరణలోకి వస్తుందని పక్కింటి వారు చంపారంటూ పెంపకందారురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్ చానా కుమార్తె ఆశాకు తన మేనల్లుడు గత మార్చి నెలలో పుట్టిన రోజు సందర్భంగా పర్షియన్ జాతి పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లి.. ఇటీవల పక్కింటి ఆవరణలోని చెట్ల చల్లదనానికి అలవాటు పడింది. తమ పిల్లి ఈనెల 28వ తేదీ తెల్లవారుజము నుంచి కనిపించడం లేదని యజమాని చానా తెలిపారు. కాగా తమ ఇంటి పరిసరాల్లో గాలించగా రోడ్డుపై మృతదేహం కనిపించింది. పిల్లి మృతికి పక్కింటి కుమారి కారణమని ఆరోపిస్తూ పిల్లి యజమాని చానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 429 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కఠినంగా శిక్షించాలి: పిల్లిపై వీధి కుక్కలు దాడి చేసి చంపి ఉండొచ్చని కుమారి కుటుంబీకులు తెలిపారు. పిల్లిని తాము రూ.40వేలకు కొనుగోలు చేశామని, కనీసం పాలు కూడా తాగదని ప్రత్యేక ఆహారం అందిస్తున్నట్లు చానా తెలిపారు. సదరు పిల్లి ప్రస్తుతం గర్భంతో ఉందని తెలిపిన చానా... దాని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
నాలుగు నెలలుగా పెంచుకుంటున్నాం. మా అమ్మాయి బర్త్ డేకి గిఫ్ట్‌గా ఇచ్చారు. మూడుసార్లు వెళ్లినా కనిపించలేదు. నాలుగో సారి వెళ్తే కనిపించింది. గతంలో ఓ సారి పిల్లి కారణంగా పక్కింటి వాళ్లతో మాకు గొడవైంది. అప్పుడే చంపేస్తామని హెచ్చరించారు. కానీ, ఇలా జరుగుతుందని ఊహించలేదు. పోలీసులు వచ్చి విచారణ చేశారు. - షేక్ చానా, పిల్లి యజమాని
పిల్లిని చంపిన వాళ్లకి శిక్ష పడాలి. పిల్లిని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చిందో ఏమో.. ఇది ఎంత వరకు న్యాయం. - చానా బంధువు, పిల్లుల పెంపకం దారురాలు