జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై కేసు నమోదైంది. ఆ మహిళ కోచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు ఐపీసీ సెక్షన్లు కింద సెక్టార్ 26 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, దర్యాప్తు పూర్తయ్యేంతవరకు.. క్రీడా శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నట్లు సందీప్ సింగ్ తెలిపారు.
నా ఇమేజ్ చెడగొట్టడానికే ఈ కుట్ర: సందీప్ సింగ్
తనపై వస్తున్న ఆరోపణలు సందీప్ సింగ్ ఖండించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. తనపై వచ్చిన 'నిరాధార ఆరోపణల'పై.. పూర్తి దర్యాప్తు చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరారు. ఆ మహిళ కోచ్ గతాన్ని కూడా పరిశీలించాలని అన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అలా మెసేజ్ చేశారు..
సందీప్ సింగ్ తనను ఓ జిమ్‌లో చూశారని.. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారని మహిళా కోచ్ ఆరోపించారు. ఓసారి ఆయన్ను కలవడానికి కార్యలయానికి వెళ్లినపుడు.. తనను వేధించారని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఆయన(సందీప్ సింగ్, మంత్రి) నన్ను కార్యాలయంలోని ఓ క్యాబిన్లోకి తీసుకెళ్లారు. అనంతరం నా కాళ్లపై చేతులు వేశారు. నన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డానని చెప్పారు. నువ్వు నన్ను సంతోష పెడితే.. నేను నిన్ను సంతోషంగా ఉండేలా చూస్తానని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన చేయి తీసేసినప్పుడు.. నా టీషర్ట్ చింపేశారు. నేను హెల్ప్ చేయాలని ఎంత ఏడ్చినా.. ఆ ఆఫీస్‌లో ఎవరూ పట్టించుకోలేదు" అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేసి.. పోలీసులు తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు మహిళా కోచ్ చెప్పారు.
ఈ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా డిమాండ్ చేశారు. సందీప్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని.. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ఎల్డీ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.