Captain Sanjit Bhattacharjee: దాదాపు గత పాతికేళ్లుగా కుమారుడి ఆచూకీ కోసం ఓ కన్నతల్లి చేస్తున్న న్యాయపోరాటమిది. మాతృదేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆమె తనయుడు పాకిస్థాన్ సేనలకు చిక్కి, ఆ దేశంలోని జైళ్లలో మగ్గుతున్న దారుణమిది. ఆర్మీ కెప్టెన్ హోదాలో అదృశ్యమైన సంజీత్ భట్టాచార్జీని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన మార్గాల ద్వారా కేంద్రం చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ 81 ఏళ్ల కమలా భట్టాచార్జీ న్యాయపోరాటం చేస్తున్నారు. పలుమార్లు ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోనూ ఆమె దాఖలు చేసిన పిటిషనుపై వాదనలు వినేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఓ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాల్సిన ఈ పిటిషన్‌ను సత్వరం విచారించాలంటూ న్యాయవాది సౌరభ్ మిశ్ర అభ్యర్థించారు. జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లి కూడా ఉన్న సుప్రీం ధర్మాసనం ఏప్రిల్ మొదటివారంలో ఈ పిటిషను విచారిస్తామని పేర్కొంది.
- కమలా భట్టాచార్జీ పిటిషనుపై స్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు గతేడాది మార్చి 5న కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. భారతసైన్యంలోని గోర్ఖా రైఫిల్స్ రెజిమెంటు అధికారిగా 1992 ఆగస్టులో నియామకం పొందిన సంజీత్ లాహోర్‌లోని కోట్ లఖపత్ జైలులో ఉన్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనరు చెబుతున్నారు. 1997 ఏప్రిల్ 20న గుజరాత్‌లోని కచ్ వద్ద రాత్రిపూట పెట్రోలింగు విధుల్లో ఉన్న సంజీత్‌ను పాకిస్థాన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకొన్నట్లు తమ కుటుంబానికి సమాచారం అందించారని వెల్లడించారు. గత 24 ఏళ్లుగా సంజీత్‌కు కుటుంబంతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. సంజీత్ పేరును బతికున్న 'మిస్సింగ్' యుద్ధఖైదీల జాబితాలో చేర్చినట్లు 2010లో సైనికాధికారి నుంచి ఓ లేఖ అందింది. కుమారుడి కోసం ఎదురుచూస్తూ తండ్రి 2020లో మృతిచెందగా.. కన్నుమూసేలోపు ఒక్కసారైనా సంజీత్‌ను చూడాలని తల్లి తహతహలాడుతోంది.
ఇదీ చూడండి: కాంగ్రెస్ ఘోర పరాభవం- జీ23 నేతల సమావేశం