ఉత్తరాఖంఢ్ సీఎంగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన తీరథ్ సింగ్ రావత్.. మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చిరిగిన జీన్స్ ధరించిన మహిళలు సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేహ్రాదూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళల వస్త్రధారణపై ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను ఓ రోజు రాజస్థాన్ నుంచి వస్తున్నాను. విమానంలో నా పక్కన ఓ సోదరి కూర్చుంది. ఆమె వైపు చూస్తే కింద గమ్‌బూట్లు ఉన్నాయి. ఇంకా కొద్దిగా పైకి చూస్తే మోకాలి వద్ద చిరిగిపోయిన జీన్స్ ఉన్నాయి. ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారని ఆమెను అడిగాను. దిల్లీ వెళ్తున్నానని చెప్పింది. ఆమె భర్త జేఎన్‌యూలో ప్రొఫెసర్ అని చెప్పింది. తాను ఎన్‌జీఓను నడుపుతున్నానని తెలిపింది. ఎన్‌జీఓ నడుపుతోంది.. చిరిగిన జీన్స్ ధరించింది. సమాజంలోకి వెళ్తుంది. పిల్లలతో కలిసి ఉంది. ఇలాంటి దుస్తులతో ఏం సందేశమిస్తుంది."
- తీరథ్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
మహిళల అసంతృప్తి..
తీరథ్‌సింగ్ వ్యాఖ్యలపై అనేక మంది మహిళా ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వస్త్రధారణ మార్చడానికంటే ముందు మీ ఆలోచనలు మార్చుకోవాలని బిగ్ బీ మనవరాలు నవ్య నవేలీ నందా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన పోస్టును డిలీట్ చేశారు. ఆమెతో పాటు సినీ నటీమణులు, ప్రముఖులు, మహిళలు రిప్‌డ్ జీన్స్ ధరించిన ఫొటోలు పెడుతున్నారు. తీరథ్ వ్యాఖ్యల తర్వాత.. ట్విట్టర్‌లో రిప్‌డ్ జీన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.
రాజకీయంగానూ..
రాజకీయంగానూ తీరథ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. సీఎం తీరథ్‌సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భాజపాలో ఉన్న మహిళా వ్యతిరేకత ప్రతిరోజూ కనిపిస్తూనే ఉందని విమర్శించింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం భాజపా నేతలకు అలవాటేనని విమర్శించింది.
భాజపా అగ్రనాయకత్వం ఈ తరహా వ్యాఖ్యలపై ఎలాంటి చర్య తీసుకోలేదని కాంగ్రెస్ నేత పీఎల్ పునియా అన్నారు. ఈ సారి ఏకంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేసినందున.. ఆయనను హెచ్చరించాలని పునియా అభిప్రాయపడ్డారు. అప్పుడైనా తీరథ్ క్షమాపణ కోరుతారన్నారు.
ఇదీ చదవండి: వ్యర్థాలతో విద్యుత్ బైక్- బాలుడి ఆవిష్కరణ