కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దిల్లీలో ఉండి కరోనా పరిస్థితిని సమీక్షించకుండా బంగాల్ ఎన్నికల ర్యాలీకి మోదీ హాజరు కావడాన్ని తీవ్ర నిర్లక్ష్యంగా పేర్కొంది.
ప్రధానిగా మోదీ తన బాధ్యతను నిర్వర్తించి ఉండాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకుంటూ కరోనా పరిస్థితులను సమీక్షించాల్సిందని అన్నారు.
"దిల్లీలో ఉండి కరోనా పరిస్థితిపై సమాలోచనలు చేయకుండా బంగాల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం ప్రధానమంత్రి నిర్లక్ష్యమే. దిల్లీలో ఉండి కరోనాపై ఆయన పోరాడాల్సింది. బంగాల్ ప్రజలు దీన్ని గుర్తించి.. ఆయనకు సరైన సమాధానం ఇస్తారని అనుకుంటున్నా. ప్రధాని హోదాలో పనిచేస్తూ.. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతపై ముఖ్యమంత్రుల డిమాండ్లను పరిష్కరించాల్సింది. ఇప్పుడు ప్రధానమంత్రి బాధ్యత కూడా ఇదే."
-పీ చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
ప్రధానితో మాట్లాడాలనుకున్నప్పటికీ.. బంగాల్ పర్యటన నేపథ్యంలో తన అభ్యర్థనను పట్టించుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఆరోపణలపై చిదంబరం స్పందించారు. కేంద్రంలో ఒకే వ్యక్తి పాలన నడుస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి: 'కరోనాపై పోరుకు కేంద్రం సంసిద్ధంగా లేదు'