కర్ణాటక బెంగళూరులో మెట్రో రైల్ ప్రాజెక్టు 2ఏ, 2బీ దశల నిర్మాణానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 58.19 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గాలకు రూ.14,788.101 కోట్లు వ్యయం కానుంది.
తాల్చేర్ ఎరువుల కర్మాగారానికి గ్రీన్ సిగ్నల్
ఒడిశాలోని తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో బొగ్గును గ్యాస్‌గా మార్చి తయారు చేసే యూరియాకు.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ. 13,277 కోట్లు అంచనా వ్యయంతో ఈ సబ్సిడీ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఫలితంగా.. ఏటా 12.70 లక్షల టన్నుల యూరియా దిగుమతిని తగ్గించడానికి కేంద్రం నిర్ణయం దోహదం చేయనుంది.
ఆర్థిక బిల్లు సవరణలకూ పచ్చజెండా..
2021-22 ఏడాదికి సంబంధించిన ఆర్థిక బిల్లు సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సవరణలతో.. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సకాలంలో ఆదాయాన్ని తీసుకురావడం సహా పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారుల సమస్యల్ని పరిష్కరించుకునేందుకు మార్గం సుగమం కానుంది.
ఈ బిల్లు మార్చి 28న.. రాష్ట్రపతి ఆమోదం పొందిన అనంతరం.. 2021 ఆర్థిక చట్టంగా మారింది.
ఇదీ చదవండి: భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల.!
ఐసీఏఐ, సీఏఏఎన్జడ్ ఒప్పందానికి ఆమోదం..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ), చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్(సీఏఏఎన్జడ్) మధ్య అవగాహనా ఒప్పందానికి సంబంధించిన కొత్త మెమోరండమ్పై సంతకం చేసేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం వల్ల దేశీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దేశానికి అధిక చెల్లింపులు జరుగుతాయని మంత్రివర్గం పేర్కొంది.
దీంతో పాటు ఐసీఏఐ, సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ ఆస్ట్రేలియా(సీపీఏఏ)ల మధ్య పరస్పర గుర్తింపు ఒప్పందంపైనా సంతకం చేసేందుకూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్టు తెలిపింది.
సీసీఐకూ ఓకే..
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), బ్రెజిల్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఫర్ ఎకనమిక్ డిఫెన్స్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది.
సీసీఐ చట్టంలో భాగంగా ఈ సంస్థ.. ఇప్పటివరకు ఆరు ఒప్పందాలు(యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్; యూరోపియన్ యూనియన్ డైరెక్టర్ జనరల్ కాంపిటీషన్; రష్యన్ ఫెడరల్ యాంటీమోనోపోలీ సర్వీస్; ఆస్ట్రేలియన్ కాంపిటీషన్, వినియోగదారుల కమిషన్; కెనడా కాంపిటీషన్ కాంపిటీషన్ బ్యూరో; బ్రిక్స్ కాంపిటీషన్ అథారిటీస్) కుదుర్చుకుంది.
ఇదీ చదవండి: స్పుత్నిక్-వి 10 రోజుల్లో భారత్‌లోకి!
భారత్, బంగ్లా వాణిజ్య సమస్యా పరిష్కారం దిశగా..
వాణిజ్య సమస్యల పరిష్కార సహకారాన్ని పెంచేలా.. ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్, బంగ్లాదేశ్ ట్రేడ్ అండ్ టారిఫ్ కమిషన్ మధ్య అవగాహన ఒప్పందానికి కేబినెట్ పచ్చజెండా ఊపినట్టు కేంద్రం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల మధ్య గత నెల 27న.. ఢాకాలో ఈ ఒప్పందం కుదిరింది.
వాణిజ్య సమస్యల పరిష్కారం, సమాచార బదిలీ, వసతుల నిర్మాణ కార్యకలాపాల్లో ఇరుదేశాల సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ ఒప్పంద ప్రాథమిక లక్ష్యం.
ఇదీ చదవండి: భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల.!