కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణ పౌరుల కోసం ఇందులో ఎలాంటి అంశాలు లేవని పేర్కొంది. రాజ్యసభలో మాట్లాడిన ఆ పార్టీ సీనియర్ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం.. తాజా పద్దును 'ధనికుల కోసం, ధనికుల చేత, ధనికులకు చెందిన బడ్జెట్'గా అభివర్ణించారు. 73 శాతం దేశ సంపదను తమ చేతుల్లో ఉంచుకున్న ఒక్క శాతం వ్యక్తుల కోసమే ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం అసమర్థంగా ఉందని ధ్వజమెత్తారు.
"దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. కరోనాకు రెండేళ్ల పూర్వమే ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం వాస్తవం. అసమర్థ ఆర్థిక నిర్వహణను దేశం మూడేళ్ల పాటు అనుభవించింది. ఫలితంగా 2017-18లో ఏ స్థితిలో ఉన్నామో 2020-21 నాటికి అదే స్థితికి చేరుకుంటాం. అభివృద్ధి చెందిన తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే డిమాండ్ లేకుండా పోయింది. ఇంకా వెనకబడిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? దేశంలోని ప్రధాన ప్రజలను విస్మరించారు. మరి ఈ బడ్జెట్ ఎవరి కోసం?"
-చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ
అసమర్థ నిర్వహణ వల్ల.. ఇప్పటికే సాధించిన ప్రగతిని కూడా కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు చిదంబరం. 2021 చివరినాటికి వృద్ధి అంచనాలన్నీ పడిపోతాయని నొక్కిచెప్పారు. ఆర్థిక వ్యవస్థ 9.4 లేదా 8.4 శాతమే వృద్ధి చెందుతుందని లెక్కగట్టారు. ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి చెందుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం ఆపాలని హితవు పలికారు. ఇది సహజ వృద్ధి మాత్రమేనని అన్నారు. జీడీపీ సాధారణ స్థాయికి చేరేందుకు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అంచనా వేశారు.
బడ్జెట్లో ప్రస్తావించిన లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేశారు చిదంబరం. కాంగ్రెస్ ఈ బడ్జెట్‌ను తిరస్కరిస్తోందని చెప్పారు. పేదలకు, వలసకూలీలకు నేరుగా నగదు సాయం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: 'పెట్రోల్ కొనేందుకు బ్యాంక్ లోన్ ఇవ్వండి'