BRS Never Win in 17 Assembly Segments : తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు అడుగుపెట్టని నియోజకవర్గాలు.. భారత రాష్ట్ర సమితికి సవాల్ విసురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో(Assembly Segments) గులాబీ జెండా ఎగరేయలేక పోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు, హైదరాబాద్‌లో పది స్థానాలు గులాబీ పార్టీకి అందని ద్రాక్షల్లాగే ఉండిపోయాయి. ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు మినహాయిస్తే మిగతా పదింటిలో ఈసారైనా గెలవాలన్న పట్టుదలతో.. ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.
కాంగ్రెస్ నేతలు పెట్టేది భూమాత కాదు భూ'మేత' - ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యమే : సీఎం కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, చంద్రాయణగుట్ట, యాఖత్ పురా, బహదూర్ పురా, మలక్ పేట, కార్వాన్, నాంపల్లిలో ఈసారి కూడా బీఆర్ఎస్ పోటీ నామామత్రంగానే ఉంది. ఆ ఏడింటిలో గులాబీ పార్టీ గెలిచే అవకాశం లేదు. గోషామహల్ నియోజకవర్గంలో ఈసారి జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్(BRS Party) ధీమా వ్యక్తం చేస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నేత రాజాసింగ్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేం సింగ్ రాథోడ్‌పై గెలిచారు.
Telangana Assembly Election 2023 : ఈ ఎన్నికల్లో నందకిషోర్ వ్యాస్‌ను బరిలోకి దించగా.. కాంగ్రెస్ నుంచి ఎం.సునీత పోటీలో ఉన్నారు. సుమారు 30వేల మైనారిటీ ఓట్లున్న(Minority Votes) గోషామహల్‌లో మజ్లిస్ అభ్యర్థిని నిలపలేదు. ఎంఐఎం సహకారంతో మైనారిటీ ఓట్లు సాధిస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ ఉంది. మరోవైపు నియోజకవర్గంలో ప్రభావం చూపే ఉత్తర భారతదేశానికి చెందిన సెటిలర్లు, మార్వాడీ సామాజికవర్గం ఓట్లు నందకిషోర్ వ్యాస్‌కే పడతాయని అంచనా వేస్తోంది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఇప్పటివరకు జెండా ఎగరేయలేక పోయింది. 2014లో టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య విజయకేతనం ఎగరేయగా.. కారు పార్టీ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్ రెండో స్థానంలో.. కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎం.రామ్మోహన్ గౌడ్‌పై.. కాంగ్రెస్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గెలిచారు. ఇప్పుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ మధుయాష్కీ గౌడ్‌ను(Madhuyashki Goud) బరిలోకి దించింది.
బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే-పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్
BRS Election Campaign Josh in Telangana : ద్విముఖ పోరులో గెలుపు తమదేనని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మహేశ్వరం నియోజకవర్గంలో 2014లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతి విజయం సాధించారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి సబితా బరిలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో గట్టి పోటీ ఇస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట, సత్తుపల్లి, మధిర, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అడుగుపెట్టలేక పోయింది. 2014 ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లకే పరిమితమైన గులాబీ పార్టీ.. 2018లో కొంతమేర పుంజుకున్నప్పటికీ.. విజయతీరాలను మాత్రం చేరలేక పోయింది. పినపాకలో 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించిన పాయం వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొని.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓటమిపాలయ్యారు.
BRS Political Strategy in Telangana : ఇప్పుడు రేగా కాంతారావు బీఆర్ఎస్ తరఫున.. పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తరఫున తలపడుతున్నారు. భద్రాచలంలోనూ బీఆర్ఎస్కు గత రెండు ఎన్నికల్లో చుక్కెదురైంది. 2014లో సీపీఎం(CPM Party) నేత సున్నం రాజయ్య గెలవగా.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఈసారి తెల్లం వెంకట్రావు బరిలో ఉన్నారు. అశ్వరావుపేటలో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు గెలవగా.. 2018లో తెలుగుదేశం అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పుడు మెచ్చా నాగేశ్వరరావు.. గులాబీ జెండాతో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హస్తం పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటును కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుంది : కేసీఆర్
సత్తుపల్లిలో గత రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం జెండానే ఎగిరింది. సండ్ర వెంకట వీరయ్య టీడీపీ అభ్యర్థిగా 2014, 2018 ఎన్నికల్లో గెలిచారు. బీఆర్ఎస్ 2014లో నాలుగో స్థానం.. 2018లో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి సండ్ర వెంకటవీరయ్య అధికార పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగారు. మధిరలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క(Congress leader Bhatti Vikramarka).. 2014, 2018లో వరసగా రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండో స్థానంతో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఈసారి కూడా భట్టితో తలపడుతున్నారు.
గులాబీ దళానికి కొరకరాని కొయ్యలుగా..: టికెట్ ఆశించిన విఫలమైన బమ్మెర రామ్మూర్తి బీఆర్ఎస్ రెబల్‌గా బరిలో ఉన్నారు. వైరా, ఇల్లందు కూడా గులాబీ దళానికి కొరకరాని కొయ్యలుగానే ఉన్నాయి. వైరాలో 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మదన్‌లాల్ గెలవగా, 2018లో స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ విజయం సాధించారు. రాములు నాయక్ అనంతరం బీఆర్ఎస్లో చేరారు. వైరాలో రాములు నాయక్‌ను పక్కన పెట్టిన కేసీఆర్.. మదన్‌లాల్‌కు అవకాశం ఇచ్చారు.
అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం : కేటీఆర్
వైరాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. ఇల్లెందులో గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ దెబ్బతిన్నది. 2014లో కాంగ్రెస్ నేత కోరం కనకయ్య, 2018లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ గెలిచారు. ఎన్నికల తర్వాత గులాబీ పార్టీలో చేరిన హరిప్రియ... సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటూ.. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్యతో తలపడుతున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్..: పాలేరులో ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరినప్పటికీ.. రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులపై బీఆర్ఎస్ గెలవలేక పోయింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి వెంకట్‌రెడ్డి, 2018లో కాంగ్రెస్(Congress Party) అభ్యర్థిగా కందాల ఉపేందర్‌రెడ్డి గెలిచారు. అయితే.. 2016లో జరిగిన ఉపఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితరెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.
ఇప్పుడు బీఆర్ఎస్ జెండాతో బరిలోకి దిగిన కందాల ఉపేందర్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య హోరాహోరీ నెలకొంది. పది స్థానాల్లోనూ జెండా ఎగరేయాలని కసరత్తు చేస్తున్నప్పటికీ.. గట్టి పోటీ నెలకొంది. దీంతో ఎత్తులు, పైఎత్తులు.. వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు కష్టపడుతోంది. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
'కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దు - కర్ణాటకలో ఆ పార్టీ దివాళా దిశగా నడుస్తోంది'
ఎన్నికల సిత్రాలు - ఓట్ల కోసం రాజకీయ నేతల పాట్లు - చెప్పులు కుట్టినా, చేపలు అమ్మినా గెలుపు కోసమే!