Brother Murder Opposing Sister Molestation : అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షా బంధన్ పండుగకు రెండు రోజుల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో దారుణం జరిగింది. తన సోదరిపై వేధింపులు వ్యతిరేకించినందుకు సోదరుడిని కొందరు కొట్టి చంపారు. బాధితుడిని కిశోర్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఖేరీ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన కిశోర్.. తన సోదరితో సోమవారం పాఠశాలకు వెళ్లాడు. అయితే తరగతి గదిలో కిశోర్ బిగ్గరగా మాట్లాడినందుకు మిగతా విద్యార్థులు.. అతడిపై కోప్పడ్డారు. దీంతో కిశోర్ వారితో గొడవపడ్డాడు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలోనూ.. విద్యార్థులతో బాధితుడు మళ్లీ వాగ్వాదానికి దిగాడు.
Sister Molestation Brother Murder : అయితే కిశోర్ సోదరి.. గొడవను అడ్డుకుంది. ఆ సమయంలో మిగతా విద్యార్థులు.. ఆమెపై వేధింపులకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపించారు. సోదరిపై వేధింపులను కిశోర్ వ్యతిరేకించడం వల్ల.. అతడిపై నిందితులు చెక్క పలకతో దాడి చేశారు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కిశోర్ మరణించాడన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆగ్రహానికి లోనయ్యారు. ఖేరీ-కోరాన్ హైవేను దిగ్బంధించి నిరసన ప్రారంభించారు. పోలీసు కమిషనర్ రమిత్ శర్మ ఘటనాస్థలానికి చేరుకుని.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలే ఈ ఘటనకు కారణమని చెప్పారు.
![Prayagraj Brother beaten death for opposing molestation with sister, Villagers jammed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-08-2023/up-pra-01-student-murder-vis-byte-7209586_29082023113727_2908f_1693289247_833.jpg)
మహిళపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
Woman Gangarape In UP : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలోని ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చంపేస్తామని బెదిరించారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు వివరాల ప్రకారం.. జిల్లాలోని ముర్సాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఇదే అదనుగా తీసుకున్న యువకులు.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 26న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బాధితురాలు.. పశువుల కోసం మేత సేకరించేందుకు పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు యువకులు ఆమెను అడ్డుకున్నారు. శబ్దం చేస్తే చంపేస్తానని పిస్టల్‌తో బెదిరించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమెను నగ్నంగా మార్చి వీడియో తీశారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అసభ్యకరమైన వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. భర్త, కుమారులను కూడా చంపేస్తామని చెప్పారు. దీంతో మహిళ.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ నిందితులు మాత్రం ఆమె అసభ్యకర వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మహిళ ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.