Brother And Sister Meet After 76 Years : దేశ విభజన సమయంలో కుటుంబానికి దూరమయ్యాడు ఓ వ్యక్తి. అనంతరం 76 ఏళ్ల తర్వాత తన సోదరిని పాకిస్థాన్‌లో కర్తార్‌పుర్ కారిడార్‌లో కలిశాడు పంజాబ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు. అసలు ఈ కథేంటంటే?
1947లో భారత్-పాకిస్థాన్ విభజన సమయంలో పంజాబ్‌కు చెందిన గుర్మైల్ సింగ్ కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. అప్పటికి గుర్మైల్ సింగ్ వయసు ఐదేళ్లు. అతడి కుటుంబం పాక్‌కు వెళ్లే సమయంలో ఇంట్లో గుర్మైల్ లేడు. ఆర్మీ అధికారులు, గుర్మైల్ తల్లిదండ్రులు వెతికినా అతడు కనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక గుర్మైల్ను విడిచిపెట్టి అతడి తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత గుర్మైల్ తల్లిదండ్రులకు 1955లో సకీనా అనే చిన్నారి జన్మించింది. ఆమె వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. యూట్యూబ్ సాయంతో తన అన్నను గుర్తించింది సకీనా.
'నా సోదరుడు పాకిస్థాన్‌లో ఉన్న మా కుటుంబానికి ఉత్తరాలు రాసేవాడు. అప్పటికి నా వయసు రెండున్నరేళ్లు. అప్పుడు మా అమ్మ మరణించింది. క్రమంగా నా సోదరుడి నుంచి ఉత్తరాలు రావడం తగ్గాయి. నేను పెద్దయ్యాక మా నాన్న.. నాకు ఒక సోదరుడు ఉన్నాడని, అతడి ఫొటోలను నాకు చూపించాడు. అప్పటి నుంచి నేను సోదరుడి కలవాలని అత్రుతగా ఎదురుచూసేదాన్ని. నా సోదరుడు గుర్మైల్ గురించి తెలుసుకునేందుకు నా అల్లుడు ఓ పాక్ యూట్యూబర్‌ను సంప్రదించాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో నా సోదరుడు గుర్మైల్ సింగ్ ఫొటోలు, ఆయన లేఖలు పెట్టగా అతడి ఆచూకీ తెలిసింది. 2022లోనే నా సోదరుడితో వీడియో కాల్ మాట్లాడాను.' అని గుర్మైల్ సింగ్ సోదరి సకీనా(68) తెలిపింది.
సకీనా, గురుమైల్ సింగ్ ఇద్దరు ఇటీవల కర్తార్‌పుర్ కారిడార్‌లో కలుసుకున్నారు. ఒకరినొకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు తమకు వీసాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలా అయితే కొన్నాళ్లు తన అన్నతో కలిసి ఉంటానని చెబుతోంది సకీనా. అలాగే తన సోదరుడు కూడా పాకిస్థాన్‌కు వచ్చేందుకు వీలవుతుందని ప్రాధేయపడింది. 80 ఏళ్ల వయసులో తన సోదరిని కలవడం పట్ల గుర్మైల్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు భార్య, కుమార్తె ఉందని చెప్పాడు.
పాక్‌లో ఒకరు.. భారత్‌లో మరొకరు.. 75ఏళ్లకు కలిసిన సోదరులు.. ఏడాదికే ఒకరి మృతి
80 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాచెల్లెళ్లు.. హామ్ రేడియో సహాయంతో గుర్తింపు.. కానీ అప్పటికే!