వివాహ వేడుకల్లో మునిగి తేలుతున్న సందర్భంలో మరో శుభవార్త వింటే ఆ కిక్కే వేరు. అలాంటి అనుభూతినే పొందింది.. ఓ నవ వధువు. పెళ్లి రోజునే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాంపుర్ జిల్లాలో ఆదివారం జరిగింది.
ఇదీ జరిగింది..
ఈనెల 2వ తేదీన.. జిల్లాలోని మొహమ్మద్పుర్ జాదిద్ గ్రామానికి చెందిన గంగసరన్ అనే వ్యక్తి కూతురు పూనమ్.. వివాహం కోసం అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. బరేలీ జిల్లాకు చెందిన వరుడు బరాత్‌తో వచ్చాడు. గంగసరన్ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. వధువు పెళ్లికి సంబంధించిన సంప్రదాయ పూజల్లో పాల్గొంది. ఆ వాతావరణం మొత్తం సంతోషమయంగా మారిపోయింది. ఆ సందర్భంలోనే వారికి మరో శుభవార్త అందింది. అదే.. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో 601 ఓట్లు సాధించి బీడీసీ సభ్యురాలిగా పూనమ్ ఎన్నికైనట్లు తెలిసింది. ఇంకేముంది వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ప్రత్యర్థిపై 30 ఓట్ల తేడాతో గెలుపొందింది పూనమ్.
మండపం నుంచి నేరుగా లెక్కింపు కేంద్రానికి..
ఈ వార్త అందిన వెంటనే మండపం నుంచి నేరుగా లెక్కింపు కేంద్రానికి వెళ్లింది పూనమ్. వివాహ వస్త్రధారణలోనే అధికారుల నుంచి ధ్రువపత్రాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. విషయం తెలిసి అక్కడి వారంతా.. వధువుకు శుభాకాంక్షలు తెలిపారు.
మర్చిపోలేని సందర్భం..
ఈ సందర్భాన్ని తాను ఎన్నటికీ మర్చిపోలేనని, సంతోషం వ్యక్తం చేసింది పూనమ్.
ఇదీ చూడండి: స్టాలిన్ గెలిచారని నాలుక కోసుకున్న మహిళ