అవినీతి ఆరోపణల కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబయిలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులకు దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారని ముంబయి మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.
విచారణలో భాగంగా.. దేశ్‌ముఖ్‌పై అధికారికంగా దర్యాప్తు చేసేందుకు తగిన ఆధారాలు లభించాలని అధికారులు చెప్పారు. దేశ్‌ముఖ్‌పై రెగ్యులర్ కేసు నమోదు చేయడం సహా, మరికొందరిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వివరించారు. కేసు నమోదు తర్వాత దేశ్‌ముఖ్‌కు చెందిన పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
సోదాలు..
ఇందులో భాగంగా నాగ్‌పుర్‌లోని దేశ్‌ముఖ్ నివాసాన్నీ సీబీఐ అధికారులు సోదా చేశారు. దేశ్‌ముఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కతోల్ నియోజకవర్గాన్ని అధికారులు సందర్శించే అవకాశం ఉంది.
బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని సీబీఐని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై మహారాష్ట్ర సర్కారు, అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ వారికి చుక్కెదురైంది. సీబీఐ విచారణ అవసరమేనని సుప్రీం అభిప్రాయపడింది.
ఇదీ చదవండి- సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం