Karnataka Governor Airasia Flight : కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని వదిలేసి వెళ్లారు ఎయిర్‌ఏషియా సిబ్బంది. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఎదురుచూస్తున్న ఆయనను.. వదిలేసి విమానాన్ని టేకాఫ్ చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ హైదరాబాద్‌కు వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రాయానికి వెళ్లారు. తర్వాత ఆయన లగేజీని కూడా విమానంలో ఎక్కించారు ఎయిర్‌ఏషియా సిబ్బంది. అయితే వీఐపీ లాంజ్‌లో ఉన్న గహ్లోత్ అక్కడి నుంచి టర్మినల్ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌కు టేకాఫ్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గవర్నర్ టర్మినల్ వద్ద ఉన్న బోర్డింగ్ గేట్‌కు ఆలస్యంగా చేరుకోవడం వల్లే విమానం వెళ్లిపోయిందని ఎయిర్‌ఏషియా వర్గాలు చెప్పాయి.
అయితే, ఎయిర్‌ఏషియా సిబ్బంది నిర్వాకంపై గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు విమానాశ్రయ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఈ ఘటన కారణంగా గహ్లోత్ 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్‌కు వెళ్లిన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఎయిర్‌ఏషియా క్షమాపణలు..
మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ఏషియా ఓ ప్రకటనను విడుదల చేసింది. 'గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండటానికే మేం ప్రాధాన్యమిస్తాం. గవర్నర్ కార్యాలయంతో మా సంబంధాలను మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని ఎయిర్‌ఏషియా తమ ప్రకటనలో చెప్పింది.
3 ఎంపీలు సహా 100 మంది ప్రయాణికులను వదిలిన పైలట్
మూడు రోజుల కిందే.. ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఎయిర్ఇండియా విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడం వల్ల బీజేపీ ఎంపీలు సహా వంద మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరాల్సిన విమానంలో ఈ సమస్య తలెత్తింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.
ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఎయిర్ఇండియా విమానం దిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే విమాన పైలట్ టేకాఫ్ చేసేందుకు నిరాకరించారు. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం.. తన పనిగంటలకు మించి పనిచేయడం వల్ల విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ ససేమిరా అన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ వందమంది ప్రయాణికుల్లో జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మాదమ్, రాజ్‌కోట్ ఎంపీ మోహన్ కుందరియా, రాజ్యసభ ఎంపీ కేసరీదేవ్ సిన్హ్ ఝాలా కూడా ఉన్నారు.
ఇవీ చదవండి : విమానంలో 'హైజాక్' అంటూ ఫోన్లో ముచ్చట్లు.. నిమిషాల్లో ప్రయాణికుడి అరెస్ట్!
సోనియా, రాహుల్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విపక్ష మీటింగ్ వెళ్లి వస్తుండగా..