ప్రేమించిన యువతి కోసం ఓ బంగాల్ యువకుడు దేశ సరిహద్దులు దాటి ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. భార్యతో సహా తిరిగి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తుండగా వారిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అదుపులోకి తీసుకుంది.
జూన్ 26 సాయంత్రం బంగాల్‌లోని మాదాపూర్ సరిహద్దుల వద్ద ఓ యువతి, యువకుడు అనుమానాస్పదంగా సంచరించడాన్ని బీఎస్‌ఎఫ్ అధికారులు గుర్తించారు. వారిని విచారించగా సరైన సమాధానాలు వెల్లడించలేదు. దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. యువకుడిని బంగాల్‌లోని నదియా జిల్లా బల్లావ్‌పుర్‌కు చెందిన జైకాంతో చంద్రరాయ్ (24)గా గుర్తించారు. కాగా.. అతడి వెంట ఉన్న యువతిని బంగ్లాదేశ్‌కు చెందిన పరిణీతి (18)గా తేల్చారు.
చంద్రరాయ్‌కి ఫేస్‌బుక్‌లో సదరు యువతితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. ఓ మధ్యవర్తి సాయంతో చంద్రరాయ్ మార్చి 8న బంగ్లాదేశ్ వెళ్లాడు. మార్చి 10వ తేదీన పరిణీతిని అక్కడే వివాహం చేసుకున్నాడు. జూన్ 25 వరకు బంగ్లాదేశ్‌లోనే ఉన్నాడు. ఆ దేశం వైపు నుంచి సరిహద్దు దాటించేందుకు ఓ వ్యక్తికి తాను 10000 బంగ్లాదేశీ టాకాలు ఇచ్చినట్లు పరిణీతి అధికారులకు తెలిపింది. తదుపరి విచారణ కోసం బీఎస్‌ఎఫ్ అధికారులు వీరిద్దరిని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: Live Video: యువకుడ్ని గుద్ది చంపిన ఎద్దు