బంగాల్ భాజపా ఎంపీ అర్జున్ సింగ్ (MP Arjun Singh) నివాసంపై వారం రోజుల్లో రెండో సారి బాంబు దాడి (West Bengal MP bomb) జరిగింది. ఆయన ఇంటికి 200 మీటర్ల సమీపంలోని ఖాళీ ప్రాంతంలో బాంబులు పేలాయని పోలీసులు తెలిపారు. ఉత్తర పరగణాలు జిల్లా భాట్పరాలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
అయితే, టీఎంసీ సభ్యులే తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్జున్ సింగ్ ఆరోపించారు. తనతో పాటు, తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 'ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి. దీని వెనక టీఎంసీ ఉంది. నన్నూ, నాకు సంబంధించిన వారిని చంపేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. బంగాల్లో గూండాల రాజ్యం నడుస్తోంది' అని ఆరోపించారు.
మరోవైపు, అర్జున్ సింగ్ ఆరోపణలను టీఎంసీ జిల్లా అధ్యక్షుడు పార్థా భౌమిక్ ఖండించారు. అర్జున్ సింగ్ ఇంటిపై దాడికి ఏదో ఓ రకంగా ఆయనే కారణమై ఉంటారని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే ఓసారి..
సెప్టెంబర్ 8న సైతం ఎంపీ ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఈ సమయంలో ఇంట్లో అర్జున్ సింగ్ లేరు. ఎంపీ నివాసం వద్ద డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాను తృటిలో గాయాల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై ఎన్ఐఏ సోమవారమే విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే దాడి జరగడం గమనార్హం.