ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి జరిగింది. ముంబయిలోని చెంబూర్‌లో ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న సోనూ నిగమ్ బృందంపై ఓ వ్యక్తి తన సహచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. సోనూ ఫిర్యాదు మేరకు చెంబూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు.. సోనూ నిగమ్‌తో పాటు అయన స్నేహితుడు రబ్బానీ, బాడీగార్డును కిందకు తోసేశాడు. రబ్బానీ గాయపడగా.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. సోనూ బృందంపై దాడికి పాల్పడిన వ్యక్తి పేరు స్పప్నిల్ పాటేర్పేకర్ అని పోలీసులు తెలిపారు.
"సంగీత కార్యక్రమం పూర్తైన సోనూ నిగమ్ స్టేజ్‌పై నుంచి కిందకు దిగుతున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సోనూను కలిసేందుకు ప్రయత్నించాడు. వెంటనే సోనూ బాడీగార్డ్, ఫ్రెండ్ రబ్బానీ అక్కడికి వచ్చారు. అప్పుడు సోనూ బృందం.. స్వప్నిల్‌కు మధ్య గొడవ జరిగింది. అప్పుడు స్వప్నిల్.. సోనూ సహా మరో ఇద్దరిని మెట్లపై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో సోనూ స్నేహితుడు రబ్బానీ గాయపడ్డారు. అతడ్ని ఆస్పత్రికి తరలించారు.'
--పోలీసులు
నిందితుడు స్వప్నిల్ స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ పాటేర్పేకర్ కుమారుడని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడికి, సింగర్ సోనూ నిగమ్ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నాయి. అందువల్లే సోనూ సహా మరో ఇద్దరిని స్వప్నిల్ మెట్లపై నుంచి కిందకు తోసేశాడని తెలిపాయి.
"సంగీత కచేరీ తర్వాత నేను వేదికపై నుంచి కిందకు దిగుతున్నా. ఒక వ్యక్తి నా ఎదురుగా వచ్చాడు. నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే నా ఫ్రెండ్ రబ్బానీ, బాడీగార్డు హరి దగ్గరకు వచ్చారు. అప్పుడు నిందితుడు మమ్మల్ని మెట్లపై నుంచి నెట్టేశాడు. అయితే త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం. ఎందుకంటే మెట్లు పక్కన ఇనుపకడ్డీలు ఉన్నాయి. వాటి మీద పడి ఉండే నా ఫ్రెండ్ ప్రాణాలు పోయేవి."
--సోనూ నిగమ్, సింగర్
సోనూ నిగమ్‌పై జరిగిన దాడి గురించి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే కుమారుడు స్వప్నిల్.. సోనూ నిగమ్‌తో సెల్ఫీ కోసం ప్రయత్నించాడని ఆమె తెలిపారు. అప్పుడు సోనూ బాడీగార్డ్.. స్వప్నిల్ ఎవరో తెలియక అతడిని ఆపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్వప్నిల్‌కు, బాడీగార్డ్‌కు మధ్య చిన్న గొడవ జరిగిందని.. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు వ్యక్తులు కిందపడిపోయారని ప్రియాంక తెలిపారు.