Body dragged with rope: బిహార్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బెగూసరాయ్‌లో ఓ వ్యక్తి మృతదేహానికి తాడు కట్టి.. నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సంబంధిత వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. మృతదేహం తరలింపు విషయంలో పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెగూసరాయ్‌లోని లాఖో పోలీస్‌స్టేషన్ పరిధి నిపానియా సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో బుధవారం రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు.. మరణించిన వ్యక్తి కాలికి తాడుకట్టి నేలపై ఈడ్చుకుంటూ కొంత దూరం తీసుకెళ్లారు.
అక్కడ మృతదేహాన్ని ట్రాక్టర్‌లోకి ఎక్కించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్ట్రెచర్‌పైకి షిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్లారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహంపై వీధికుక్కలు దాడి చేసినట్లు స్థానికులు చెప్పారు. మరోవైపు.. ఈ వ్యవహారంలో బెగూసరాయ్ పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ జంతు కళేబరంలా వ్యక్తి మృతదేహాన్ని లాక్కెళ్లారని స్థానికులు మండిపడ్డారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందినట్లు ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నామని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇవీ చదవండి: మంకీపాక్స్పై కేంద్రం అప్రమత్తం.. రంగంలోకి టాస్క్ఫోర్స్
చెస్ పండగ షురూ.. మోదీ చేతుల మీదగా ఒలింపియాడ్ పోటీలు ప్రారంభం