Bjp Up Election: ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా తన ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా.. దిల్లీ నుంచి 150 మందికిపైగా నేతలను ఈ రెండు రాష్ట్రాలకు పంపించింది. 100 మందికిపైగా సీనియర్ నేతలు, కార్యనిర్వాహకులు పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా భాజపా అధిష్ఠానం నియమించింది. వీరంతా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని దిల్లీలోని భాజపా వర్గాలు వెల్లడించాయి.
Bjp teams to states: జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో భాజపా నేతల బృందాల పనితీరును దిల్లీ భాజపా అధ్యక్షుడు విజేంద్ర గుప్తా, భాజపా ప్రధాన కార్యదర్శి దినేశ్ ప్రతాప్ సింగ్ పర్యవేక్షించనున్నారు. "ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పార్టీకి సాయం చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నేతలను పంపడం సాధారణ ప్రక్రియ. దిల్లీకి సమీపంలో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉండడం వల్ల అక్కడి నేతలను ఈ రాష్ట్రాలకు పంపుతున్నారు"అని దిల్లీకి చెందిన భాజపా సీనియర్ నేత ఒకరు తెలిపారు.
'గెలుపు మాత్రమే కాదు..'
Bjp Uttarakhand Polls: పశ్చిమ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 50 రోజులపాటు దిల్లీ నేతలు ఉంటారని సదరు సీనియర్ నేత పేర్కొన్నారు. "ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని మరోసారి చేపట్టడమే కాకుండా.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యం" అని పేర్కొన్నారు.
దిల్లీ భాజపా ఉపాధ్యక్షులు వీరేంద్ర సచ్దేవ సహా అశోక్ గోయెల్ దేవ్రాహా, సునీల్ యాదవ్, భాజపా అధికార ప్రతినిధులు విక్రమ్ బిధూరీ, ఆదిత్య ఝా, మోహన్ లాల్ గోహారా, బ్రిజేశ్ రాయ్, మాజీ మేయర్ జై ప్రకాశ్ జేపీ వంటి నేతలు ఉత్తర్‌ప్రదేశ్‌లో మోహరించిన నేతల్లో ఉన్నారు. మరో 60 మంది నేతలు ఉత్తరాఖండ్‌లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.
ఇదీ చూడండి: 'పటేల్ జీవించి ఉంటే ముందుగానే గోవాకు స్వాతంత్య్రం'
ఉత్రర్ప్రదేశ్లో జన్ విశ్వాస్ యాత్ర..
Jan vishwas yatra: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. 'జన్ విశ్వాస్ యాత్ర'కు భాజపా ఆదివారం శ్రీకారం చుట్టింది. అంబేద్కర్ నగర్ నుంచి ఈ యాత్రను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం.. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రత్యర్థి పార్టీలపై జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
"కొందరికి జిన్నా అంటే ఇష్టం. కానీ, మాకు చెరకు రైతులు అంటే ఇష్టం" అని నడ్డా పేర్కొన్నారు. 15 మంది ఉగ్రవాదులను ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన హయాంలో విడుదల చేశారని ఆరోపించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సూత్రంతో తమ పార్టీ పని చేస్తోందని చెప్పారు.
ఇదీ చూడండి: 'సీఎం నా ఫోన్ ట్యాప్ చేసి వింటున్నారు!'
ఉత్తరాఖండ్‌లో...
Vijay Sankalp Yatra: ఉత్తరాఖండ్‌లో 'విజయ్ సంకల్ప్ యాత్ర'ను భాజపా చేపట్టింది. బాగేశ్వర్ జిల్లాలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో ఆదివారం ఈ యాత్ర కొనసాగింది. హరిద్వార్‌లో శనివారం ఈ యాత్రను జేపీ నడ్డా ప్రారంభించారు. కుమావు ప్రాంతం నుంచి ధామీ, ఠాకూర్ ఈ యాత్రలో భాగమయ్యారు.
ఇవీ చూడండి: