కేరళలో ఈసారి ఎలాగైనా ప్రభావం చూపాలని ఆశించిన భాజపాకు భంగపాటు ఎదురైంది. కామ్రేడ్ల జోరుతో ఖాతా కూడా తెరవలేకపోయింది. 2016లో గెలిచిన ఒక్క స్థానాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.
పాలక్కడ్ నుంచి పోటీ చేసిన మెట్రోమ్యాన్ శ్రీధరన్, త్రిస్సూర్ నుంచి బరిలోకి దిగిన సినీ నటుడు సురేశ్ గోపీ, రెండు చోట్ల నుంచి పోటీ చేసిన భాజపా అధ్యక్షుడు కే సురేంద్రన్ ఓటమి పాలయ్యారు. దీంతో భాజపా ఉన్న ఒక్క సీటునూ కోల్పోయింది. 2016లో నీమం నియోజకవర్గంలో గెలిచిన ఆ పార్టీ.. ఈ సారి కే రాజశేఖరన్‌ను అక్కడ పోటీలో నిలిపింది. అయినా నెగ్గలేకపోయింది.
గత ఎన్నికల్లో నీమం నుంచి భాజపా అభ్యర్థిగా ఓ రాజగోపాల్ పోటీ చేసి గెలుపొందారు. ఈసారి ఆయన బరిలో లేరు. ఆయనకు గోవా గవర్నర్ పదవి దక్కే అవకాశాలుండటమే కారణంగా తెలుస్తోంది.