త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపా పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలోనే రాష్ట్రపతి అభ్యర్తిపై ఉత్కంఠకు తెరదించే అవకాశముంది. నేడు యోగా దినోత్సవం (జూన్ 21) దృష్ట్యా మైసూర్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని మైసూర్ నుంచి వచ్చాక పార్లమెంటరీ బోర్డు భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 5 రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. అధికార పక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం భాజపా కమిటీ వేసింది. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. అయితే విపక్షాలతో చర్చింది ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ఈ కమిటీకి భాజపా అధిష్టానం సూచించింది. దీంతో పలువురు ప్రతిపక్ష నేతలతో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంప్రదింపులు జరిపారు. మరోవైపు అభ్యర్థి ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం విపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29న చివరి తేదీ.
తెరపైకి యశ్వంస్ సిన్హా: రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు తాజాగా తెరపైకి వచ్చింది. రాష్ట్రపతిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాన్ని మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఈ పదవికి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో నేత కూడా ముందుకురాని తరుణంలో ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మంగళవారం ప్రధాన విపక్షాలతో శరద్ పవార్ నిర్వహిస్తున్న ఒక సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉంది.
వ్యూహాత్మక ఎంపిక: సిన్హా గత ఏడాది భాజపా నుంచి బయటకు వచ్చి తృణమూల్‌లో చేరారు. ఆయనకు ఇప్పటికే కొన్ని పార్టీలు మద్దతు పలికాయనీ, 85 ఏళ్ల సిన్హా అభ్యర్థిత్వంపై తృణమూల్ ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. వాజ్‌పేయీ హయాంలో, మోదీ నేతృత్వంలో పాలన ఎలా మారిందో తేడా చెప్పే క్రమంలో సిన్హా పేరును తెరపైకి వ్యూహాత్మకంగా తెచ్చినట్లు చెబుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన సిన్హా 1984లో జనతాదళ్‌లో చేరారు. తర్వాత భాజపాలో చేరారు. ప్రస్తుతం తృణమూల్ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.
నా కంటే మెరుగైనవారు ఉంటారు: ప్రతిపక్షాల ప్రతిపాదనను తాను అంగీకరించలేకపోవడానికి కారణాలు వివరిస్తూ గోపాలకృష్ణ గాంధీ సోమవారం ఒక ప్రకటన చేశారు. "రాష్ట్రపతి పదవికి పోటీ చేసేవారు విపక్ష ఐక్యతతో పాటు జాతీయ స్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించగలగాలి. ప్రస్తుత ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా పలువురు విపక్ష నేతలు ప్రతిపాదించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దానికిగానూ వారికి రుణపడి ఉంటాను. కానీ ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రోది చేయడంలో నా కంటే ఎంతో మెరుగైనవారు ఉంటారని అనిపించింది. అలాంటి నేతకు అవకాశం ఇవ్వాలని నాయకుల్ని నేను కోరాను. చిట్టచివరి గవర్నర్ జనరల్‌గా రాజాజీ, ప్రప్రథమ రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కలలుగన్న రీతిలో రాష్ట్రపతి హోదాకు తగిన వ్యక్తి మన దేశానికి లభించాలి" అని ఆయన పేర్కొన్నారు.
అవతలి పక్ష అభ్యర్థి కోసం నిరీక్షణ: రాష్ట్రపతి అభ్యర్థిపై తదుపరి చర్చ కోసం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పార్లమెంటు అనుబంధ భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తాను హాజరు కాలేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. సొంత చొరవతో తొలి సమావేశాన్ని నిర్వహించిన ఆమె రెండో సమావేశానికల్లా దూరం కావడంతో ప్రతిపక్షాల ఐక్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజా భేటీకి అకాలీదళ్, వైకాపా వంటివి గైర్హాజరు కావచ్చని తెలుస్తోంది. తన ప్రతినిధిగా ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్‌ను పంపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించారు.
పరిశీలనలో సుశీల్‌కుమార్ శిందే పేరు: యశ్వంత్ సిన్హా పేరుపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ శిందే పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. డీఎంకే, శివసేనలు కొత్త అభ్యర్థి పేర్లను ప్రతిపాదించవచ్చన్న తెలుస్తోంది. ఆ పేర్లు అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే ఎన్డీయే తన అభ్యర్థిని ఖరారు చేసేంతవరకూ విపక్షం వేచి చూడొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ఎన్డీయే మాత్రం ప్రతిపక్షాల అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్నట్లు భాజపా నేతలు చెబుతున్నారు. గిరిజన నేతకు, మహిళకు, లేదా ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన పార్టీలో ఉందనీ, ప్రతిపక్షాలు ప్రకటించే అభ్యర్థిని బట్టి ఇది ఆధారపడి ఉంటుందని సమాచారం. ఒక కూటమి నిర్ణయం కోసం మరో కూటమి ఎదురుచూస్తున్న నేపథ్యంలో మంగళవారం ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంపై సందేహాలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: Yoga Day: సులువైన యోగాసనాల సాధనతో మెరుగైన జీవనం..