బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అస్గ్రామ్ నియోజకవర్గం నుంచి ఓ పని మనిషిని.. తమ అభ్యర్థిగా దింపింది భాజపా. గుస్కరా మున్సిపాలిటీ మూడో వార్డుకు చెందిన కలితా మజ్హీ.. అస్గ్రామ్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేయనున్నారు.
పార్టీ అధిష్ఠానం ఆమె పేరును ప్రకటించగానే.. స్థానిక భాజపా నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు. కాసేపటి తర్వాత తేరుకుని... పని మనిషే తమ ఎమ్మెల్యే అభ్యర్థి అని నిర్ధరించుకున్నారు.
కలితా.. తన పనికి నెల రోజుల పాటు సెలవు పెట్టి ప్రచారంలో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
కలితా భర్త సుబ్రతా మజ్హీ.. ఓ ప్లంబర్. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు.
తడబడ్డా.. తేరుకుని
భాజపా ఆమె పేరును వెల్లడించాక మీడియాతో మాట్లాడుతూ తడబడ్డారు కలితా. మర్చిపోయి.. తాను తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని అని చెప్పారు. ఒక్కసారిగా తన తప్పును గ్రహించి.. భాజపా అభ్యర్థిని అని స్పష్టం చేశారు. అయితే ఆమె తడపాటుపై స్థానిక భాజపా నేతలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.
మోదీ పాలన నచ్చి..
ప్రధాని నరేంద్ర మోదీ.. పరిపాలన నచ్చి ఐదేళ్లుగా భాజపాతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు కలితా. నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే విమర్శల బాణం ఎక్కుపెట్టారు. 'ఖేలా హోబే'(ఆట ఆడదాం) అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి... "మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కలితా. తాను 25వేల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం రోజూ నాలుగు ఇళ్లల్లో చేసే పనిని మానేశానని వివరించారు.
ఇదీ చదవండి : బంగ్లా జాతిపితకు గాంధీ శాంతి బహుమతి