BJP alliance in UP: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు అప్నాదళ్, నిషాద్ పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మూడు పార్టీలు కలిసి మొత్తం 403 సీట్లలో బరిలో నిలవనున్నట్లు చెప్పారు. విస్తృత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
" ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు.. 2019 లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అప్నాదళ్, నిషాద్ పార్టీ, భాజపా కలిసి మొత్తం 403 స్థానాల్లో బరిలో నిలుస్తాయి. కొద్ది రోజులుగా రెండు పార్టీలతో విస్తృత చర్చలు జరిపాం. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళుతోంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో వలసలు, రౌడీల ఆగడాలు, కిడ్నాప్‌లు తగ్గాయి. మోదీ, యోగి నాయకత్వంలో రాష్ట్రంలో చట్టం తిరిగి ప్రాణం పోసుకుంది. "
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
ఈ సందర్భంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు అప్నాదళ్ అధినేత అనుప్రియా పటేల్, నిషాద్ పార్టీ సారథి సంజయ్ నిషాద్. ఓబీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. భాజపా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్డీఏ మరోమారు అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకంపై త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ నేత, ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్.. భాజపాలో చేరిన రోజునే ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారం మొదటి, రెండో దశ పోలింగ్ కోసం.. భాజపా 107 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పుర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సిరతు నియోజకవర్గంలో బరిలో నిలుస్తున్నారు.
యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్న ఈసీ.. మార్చి 10న ఫలితాలు వెలువరించనుంది.
ఇదీ చూడండి: మాయావతి 'నామమాత్రపు' పోటీ- మరి దళితుల మద్దతు ఎవరికి?