దక్షిణ దిల్లీలోని జసోలా జిల్లా పార్క్‌లో గత మూడు రోజుల్లో 24 కాకులు మరణించాయని అధికారులు తెలిపారు. సంజయ్ కొలనులో 10 బాతులు మరణించినట్లు పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ భయాల నేపథ్యంలో వీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. పక్షులు చనిపోవడానికి కారణం బర్డ్ ఫ్లూనా కాదా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా దిల్లీలోకి పక్షుల దిగుమతిని నిషేధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తెలిపింది.
దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా పదుల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో లేదు..
కర్ణాటకలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు బయటపడలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్ తెలిపారు. పక్షుల నమూనాలపై జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలిందని చెప్పారు. పొరుగు రాష్ట్రం కేరళో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేరళతో సరిహద్దు ఉన్న దక్షిణ కన్నడ ప్రాంతంలో 6 కాకులు మరణించాయని, వాటి నమూనాలకు పరీక్షలకు పంపామన్నారు.
గుజరాత్ జునాగడ్లో శనివారం నాలుగు కాకులు మరణించాయి. ఆ రాష్ట్రంలో శుక్రవారం తొలి బర్డ్ ఫ్లూ కేసును గుర్తించారు అధికారులు. మరణించిన రెండు ల్యాప్వింగ్స్ నమూనాలకు పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధరణ అయినట్లు తెలిపారు. శనివారం మరణించిన కాకుల నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు.