దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 13 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధరణ అయింది. అయితే 27 జిల్లాల వ్యాప్తంగా పక్షుల మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా 11 వందలకుపైగా కాకులు, ఇతర పక్షులు మరణించాయి. ఈ నేపథ్యంలో అగర్ మాల్వా జిల్లాలో పౌల్ట్రీ మార్కెట్లను వారం పాటు మూసేశారు అధికారులు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను పూడ్చిపెడుతున్నారు. నీముచ్, ఇందోర్‌లోనూ పౌల్ట్రీ షాపులను మూసేశారు.
బర్డ్ ఫ్లూ ఆందోళనల మధ్య రాష్ట్రంలోని ఝబువా జిల్లాలో ఐదు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. వీటి నమూనాలను పరీక్షలకు పంపించారు. నెమళ్లకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మూతపడ్డ 'జూ'లు
ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందన్న కేంద్రం హెచ్చరికలతో... ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వలస పక్షుల వల్ల బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. మరణించిన కోళ్ల నమూనాలో ఫ్లూను గుర్తించిన అధికారులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ జూను మూసేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. పక్షులపై నిఘా ఉంచిన లఖ్‌నవూలోని నవాబ్ వాజిద్ అలీ షా జూలాజికల్ గార్డెన్ సిబ్బంది... వలస పక్షులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాయ్‌బరేలీలో వలస పక్షులకు నీరు అందించే కేంద్రాలను మూసేశారు. అమేఠీలోని సంగ్రాంపుర్‌లో కొత్తగా మరో ఆరు కాకులు మరణించడం ఆందోళనను పెంచుతోంది.
రవాణా నిషేధం
మహారాష్ట్ర లాతూర్‌లోని అహ్మద్‌పుర్ ప్రాంతంలో రెండు రోజుల్లోనే 180 పక్షులు మరణించిన నేపథ్యంలో పది కి.మీల పరిధిలో హై అలర్ట్ జారీ చేశారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పౌల్ట్రీ పక్షులు, జంతువులు, దాణా, ఎరువుల రవాణాను నిషేధించారు.
'జూ'లకు ఆదేశాలు
దేశంలోని జంతుప్రదర్శనశాలల నిర్వాహకులు రోజువారీ నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పక్షులు, వాటి జాతుల వివరాలతో పాటు, అనుమానిత కేసులు, నిర్ధరించిన కేసులతో కూడిన సమాచారాన్ని ప్రతి రోజు సెంట్రల్ జూ అథారిటీతో పంచుకోవాలని తెలిపింది. జూ నిర్వాహకులు.. వైరస్‌పై పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేసింది. కృత్రిమ నీటి కుంటలను ఖాళీ చేయాలని సూచించింది. దేశ, విదేశాల్లోని జూలతో పక్షుల మార్పిడి చేసుకోవడం తాత్కాలికంగా నిలిపివేయాలని పేర్కొంది. జూ సంరక్షకులు పీపీఈ కిట్లు ధరించాలని తెలిపింది.
శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,200 పక్షులు మరణించాయి. మహారాష్ట్రలోని ఒక్క పౌల్ట్రీ ఫాంలోనే 900 పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. కాగా.. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చికెన్ అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. కొవిడ్ నుంచి కోలుకోగానే, బర్డ్ ఫ్లూ మొదలైందని విక్రేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవు... అవి తినొచ్చు!