బిహార్ ఎన్నికల రెండోదఫా పోలింగ్ ముగిసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మంగళవారం 94స్థానాలకు ఓటింగ్ జరిగింది. 17జిల్లాల్లో.. సాయంత్రం 5గంటల వరకు 53.51 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓట్లు వేశారు.
సర్టిఫికెట్ల పంపిణీ..
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు పోలింగ్ కేంద్రాల్లో వినూత్న చర్యలు చేపట్టారు అధికారులు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజల గౌరవార్థం.. వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఓటేసిన ప్రముఖులు..
బిహార్ గవర్నర్ ఫాగూ చౌహాన్, సీఎం నితీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ వంటి ప్రముఖులు ఈ దఫా పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు, ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్.. ఈ దఫా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాఘోపుర్ నుంచి తేజస్వీ, హసన్‌పుర్ నుంచి తేజ్‌ప్రతాప్ పోటీలో నిలబడ్డారు. ప్రస్తుత రోడ్డు నిర్మాణశాఖ మంత్రి నంద్ కిషోర్ యాదవ్ పాట్నా సాహెబ్ నుంచి పోటీ చేశారు.
తొలిదఫాలో..
మొత్తం 243 స్థానాల్లో 71 సీట్లకు ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. తొలిదఫాలో భాగంగా 55.69శాతం ఓటింగ్ నమోదైంది. మిగిలిన నియోజకవర్గాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవీ చూడండి:-