Bihar Inter Exam 2022: బిహార్ మోతిహరి జిల్లాలో ఏకంగా 400 మంది విద్యార్థులు.. కార్ల హెడ్లైట్స్ వెలుగులోనే 12వ తరగతి పరీక్ష రాశారు. పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడం, పరీక్ష కేంద్రంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం.
అనుకున్నది ఒక్కటి..
ఈనెల 1న(మంగళవారం) బిహార్ విద్యార్థులకు 12వ తరగతి హిందీ పరీక్ష. మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరగాల్సి ఉంది. మోతిహరిలోని మహారాజా హరేంద్ర కిశోర్ సింగ్ కళాశాల యాజమాన్యం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. కానీ.. అనూహ్యంగా పరీక్ష ఆలస్యమైంది.
సీటింగ్ విషయంలో ఆఖరి నిమిషంలో గందరగోళం తలెత్తింది. కొందరు నిరసనలకు దిగగా.. కళాశాల ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. పోలీసుల రంగప్రవేశమూ జరిగింది. చివరకు సాయంత్రం నాలుగున్నర గంటలకు మొదలైంది. 400 మంది విద్యార్థులు పరీక్ష రాయడం పూర్తి కాకముందే చీకటి పడింది. కానీ.. పరీక్ష కేంద్రంలో లైట్లు లేవు. అప్పుడు అక్కడి అధికారులకు 'మెరుపు'లాంటి ఐడియా వచ్చింది. వెంటనే దగ్గర్లో ఉన్న కార్లు అన్నింటినీ తరగతి గదుల వద్దకు తీసుకొచ్చారు. హెడ్ లైట్స్ ఆన్ చేయించారు. హుటాహుటిన జనరేటర్లు తెప్పించి, తాత్కాలికంగా లైట్లు పెట్టించారు. ఈ వెలుగులోనే విద్యార్థులు పరీక్ష పూర్తి చేశారు.
ఈ వ్యవహారంపై బిహార్ విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి దర్యాప్తునకు ఆదేశించారు. అనుకోకుండా ప్రత్యేక పరిస్థితులు ఎదురుకావడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఇదీ చూడండి: నకిలీ కొవిషీల్డ్ టీకాలతో కోట్ల రూపాయల దందా