Nitish Kumar News: తనను ఉద్దేశించి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళా ఎమ్మెల్యే ఆరోపించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఇటీవల నిర్వహించిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో కటోరియాకు చెందిన భాజపా ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రం.. స్థానికంగా మహువా(ఒక రకమైన మద్యం) నిషేధంపై మాట్లాడారు. దీని తయారీపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ అడిగారు.
అంతలోనే సీఎం నితీశ్ కుమార్ కలగజేసుకుంటూ.. మీరు చూడటానికి అందంగా కనిపిస్తారు, కానీ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలియదని ఎద్దేవా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
'ముఖ్యమంత్రి ప్రవర్తన బాధ కలిగించింది'
Nikki Hembram MLA: ఇదే క్రమంలో రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం సదరు ఎమ్మెల్యే ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం ప్రవర్తన బాధ కలిగించిందని, ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై జేడీయూ మహిళా నేత లేసి సింగ్ స్పందిస్తూ.. సంబంధిత ఎమ్మెల్యే గందరగోళానికి గురై ఉంటారన్నారు. ముఖ్యమంత్రికి ఆమెను అవమానించే ఉద్దేశం లేదని చెప్పారు.
మరోవైపు ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య.. ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. ఈ వయసులోనూ అపఖ్యాతి పాలవుతున్నారని ఆమె ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: పంజాబ్ ఎన్నికల కోసం అమిత్ షా ట్రయాంగిల్ స్కెచ్!