కులగణనకు వెళ్లిన అధికారులకు.. ఓ రెడ్ లైట్ ఏరియాలో నివాసం ఉండే మహిళలు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. దాదాపు 40 మంది మహిళలు.. తమ భర్తగా ఒక్కరి పేరే చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులంతా అవాక్కయ్యారు. చాలా మంది పిల్లలు కూడా తమ తండ్రిగా.. అతని పేరే చెప్పారు. బిహార్‌లో చేపట్టిన కులగణన కార్యక్రమంలో భాగంగా.. వివరాల కోసం వెళ్లిన అధికారులకు ఈ వింత అనుభవం ఎదురైంది.
బిహార్‌లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతోంది. అందులో భాగంగా కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకునేందుకు.. అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 17 రకాల ప్రశ్నావళిని రూపొందించి.. ప్రజల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే.. అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాకు అధికారులు వెళ్లారు. అక్కడ వివరాలు సేకరిస్తుండగా.. దాదాపు 40 కుటుంబాలు తమ భర్త కాలమ్‌లో రూప్‌చంద్ అనే పేరు నమోదు చేసుకున్నాయి. వారంతా కలిసి ఒకే పేరు చెప్పడం వల్ల అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. పూర్తి వివరాలను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
రెడ్‌లైట్ ఏరియాలో ఓ డ్యాన్సర్ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అతడిపై అభిమానంతోనే వీరంతా రూప్‌చంద్ పేరును.. తమ భర్తల పేరుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. వారికి కులం అంటు ఏది లేదని అధికారులు చెబుతున్నారు.
"ఈ ఏరియాలో కులగణన చేయమని పైఅధికారుల నన్ను నియమించారు. ఇక్కడ నేను గణన చేస్తుంటే నాకు వింత అనుభవం ఎదురైంది. అందరు తమ భర్తలుగా ఒక్కరి పేరే చెప్పారు. చాలా మంది ఆధార్ కార్డ్‌ల్లో భర్త, కొడుకు పేరు ఒకటే ఉన్నాయి." అని కులగణన సిబ్బంది రాజీవ్ రంజన్ రాకేశ్ తెలిపారు. ఇక్కడి వారంతా డాన్స్‌లు చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారని ఆయన వెల్లడించారు.
బిహార్‌లో అధికారంలో ఉన్న నీతీశ్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించింది. వివిధ దఫాలుగా ఈ గణన చేయాలని నిర్ణయించింది. మొదటి దశ కులగణన జనవరి 7న ప్రారంభమై.. అదే నెల 21న ముగిసింది. రెండో దశ కులగణన ఏప్రిల్ 1న ప్రారంభమైంది. మే 31న ఈ కులగణన పక్రియ పూర్తి అవుతుంది.