ఇరవై ఏళ్ల వయస్సు... 14 శస్త్రచికిత్సలు... రోజుకు 30 మాత్రలు... అంతంత మాత్రం పని చేసే కిడ్నీలు... కానీ ఇవేవీ అతన్ని నిరుత్సాహపరచలేదు. పారా ఒలింపిక్స్‌లో భారత్ తరఫున సత్తా చాటేందుకు ఒంటి కాలుతో సిద్ధమవుతున్నాడు కేరళ కుర్రాడు శ్యామ్ కుమార్.
తిరువనంతపురం, పెయాడ్కు చెందిన శ్యామ్ కుమార్ మూడు కిడ్నీలతో జన్మించాడు. జన్యులోపం వల్ల కుడి కాలు అతని వెనుక భాగంలో కలిసిపోయింది. ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆ కాలును వేరు చేయాల్సి వచ్చింది. అప్పటికే కిడ్నీలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. వీటికి తోడు పేదరికం. అయితే, ఇవేవీ అతడ్ని ప్రభావితం చేయలేక పోయాయి.
జీవితంలో ముందుకు సాగాలన్న శ్యామ్ సంకల్ప బలం ముందు జన్యు లోపాలు ఓడిపోయాయి. తన శరీర ఆకృతికి సరిపోయేలా కృత్రిమకాలును అమర్చుకున్నాడు. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీ చదువుతున్న అతడు అలాగే కాలేజీకి సైకిల్‌పై వెళ్లేవాడు. రోజూ సమీపంలో ఉన్న కొండలు, లోయల్లో దాదాపు 20 కిలోమీటర్ల మేర చక్కర్లు కొడుతూ ఉండేవాడు. కృత్రిమ కాలు రిపెయిర్ వచ్చినప్పుడు ఒంటి కాలుతోనే సైకిల్ తొక్కేసేవాడు.
సత్తా చాటుతా...
నిరంతర సాధనతో సైక్లింగ్‌లో పట్టు సాధించాడు శ్యామ్. ఆ అనుభవంతోనే పారా ఒలింపిక్స్‌లో దేశం తరఫున సత్తా చాటాలనుకుంటున్నాడు. ఎప్పటికైనా ప్రజాదరణ పొందే సైక్లింగ్ స్టార్ కావాలన్నదే తన ఆశయమని తెలిపిన శ్యామ్.. సైకిల్‌పై హిమాలయాలకు సోలో ట్రిప్ వెళ్లి తన చిన్ననాటి కలను నెరవేర్చుకుంటానని చెబుతున్నాడు.
ఇదీ చదవండి: సంప్రదాయమే ఆ 'స్లో ఫుడ్' రెస్టారెంట్ ప్రత్యేకత