ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎం బాక్స్ చేతిలో పట్టుకుని లేత పసుపు రంగు చీరలో మెరిసిన అధికారిణి రీనా ద్వివేది ఫొటో.. సామాజిక మాధ్యమాలను షేక్ చేసింది. ఆమె కోసం గూగుల్‌ను ఆశ్రయించారు నెటిజన్లు. ఉత్తరప్రదేశ్ ప్రజాపన్నుల కార్యాలయంలో ఆమెను ఈటీవీ భారత్ ప్రతినిధి సంప్రదించగా.. పలు విషయాలపై మాట్లాడారు.
"మేం సెలబ్రెటీలమేమీ కాదు. మామూలు వాళ్లమే. ఇంతకుముందు రెండు సార్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నాను. చాలా ఆహ్లాదకరంగా పనిచేశాం. అప్పుడూ స్థానికంగా వాట్సాప్‌లో ఫొటోలు వైరల్ అయ్యాయి. అంతేకానీ ఇప్పటిలా సామాజిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో రాలేదు. నేను పనిచేసిన చోట 100 శాతం పోలింగ్ జరిగిందన్న వార్తల్లో నిజం లేదు. 70 శాతం అయ్యుంటుంది."
-రీనా ద్వివేదీ, యూపీ ప్రజాపన్నుల శాఖ అధికారిణి
మీ గురించి ఇంతటి చర్చ జరుగుతుంటే మీ జీవితం ఎలా సాగుతోంది. ఈ విషయంపై మీ స్పందన?
"గతంతో పోలిస్తే రోజంతా బిజీగా గడచిపోతోంది. మీడియా వాళ్లు వస్తున్నారు. తెలిసినవాళ్లు కలుస్తున్నారు. పొద్దున్న వస్తున్నప్పుడు కూడా రోడ్డు మీద కొంతమంది గుర్తుపట్టారు. వాళ్లు రాజకీయ నేతల్లా ఉన్నారు. నాతో ఫొటోలు తీసుకున్నారు. అందరూ గుర్తిస్తున్నారు. నా మనసుకు మాత్రం మంచిగా అనిపిస్తుంది. సొంతూరు నుంచి, బంధువులు కూడా నా నెంబరు తెలుసుకుని ఫోన్ చేస్తున్నారు. మిమ్మల్ని మేం చూశామంటూ చెబుతున్నారు. సంతోషంగా ఉంది."
-రీనా ద్వివేదీ, యూపీ ప్రజాపన్నుల శాఖ అధికారిణి
పోలింగ్‌కు ముందురోజు ఈవీఎంలను తీసుకెళ్తున్న సమయంలో ఓ ఫొటో గ్రాఫర్ రీనా ద్వివేదీ ఫొటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. అంతే... ఒక్కసారిగా ఆ ఫొటో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాజాగా.. ఆమె నృత్యం చేస్తోన్న కొన్ని వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చూడండి: రాళ్లదాడిపై భాజపా- తృణమూల్ మాటల యుద్ధం