భాజపా, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కర్ణాటకలో నాటకీయ పరిణామాలతో ఇరు పార్టీల నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వేడిని మరింత పెంచారు. అయితే సుప్రీం కోర్టులో ఓ కేసు విషయంలో భాజపా, కాంగ్రెస్‌కు చెందిన అగ్రనేతలు బీఎస్ యడ్యూరప్ప, డీకే శివకుమార్ ఒకే తాటిపైకి వచ్చారు.
బెంగళూరులోని ఓ స్థలానికి సంబంధించిన అవినీతి కేసును తిరిగి తోడాలంటూ సుప్రీం కోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. '1991-కర్ణాటక భూ బదిలీ నియంత్రణ చట్టం' ఉల్లఘించి బెంగళూరులోని 4.20 ఎకరాల స్థలాన్ని డీనోటిఫికేషన్ చేసారన్నది కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.
తాజాగా ఈ కేసుకు సంబంధం లేని తృతీయ పక్షం.. బీఎస్ యడ్యూరప్ప, డీకే శివకుమార్‌కు ఈ కేసులో సంబంధముందటూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేసింది.
యడ్యూరప్ప తరఫున ముకుల్ రోహత్గి, డీకే శివకుమార్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆ సమయంలో డీకే కోర్టు ఆవరణలోనే ఉన్నారు. ఇరువురు న్యాయవాదులు ఈ వ్యాజ్యం విచారణ యోగ్యం కాదని వాదించారు. ఈ కేసు ఫిర్యాదుదారు గతంలోనే పిటిషన్ ఉపసంహరించినట్లు ప్రస్తావించారు.
విచారణ యోగ్యమైన వ్యాజ్యమో కాదో తెలియడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది.
- ఇదీ చూడండి: యడ్డీ 2.0 : పేరు మార్చుకున్న యడ్యూరప్ప