మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీతో అజిత్ పవార్ జట్టు కట్టడం వెనుక తన హస్తం లేదని స్పష్టంచేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్రలో త్వరలో ఏర్పడేది శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సర్కారేనని పునరుద్ఘాటించారు.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్రావ్ చవాన్ వర్ధంతి సందర్భంగా కరాడ్‌లోని ప్రీతిసంఘమ్ వద్ద నివాళులు అర్పించారు పవార్. భాజపా పక్షాన నిలవాలన్న నిర్ణయం పూర్తిగా అజిత్ పవార్‌దేనని స్పష్టం చేశారు.
"అది పార్టీ నిర్ణయం కాదు. మేము దాన్ని సమర్థించడంలేదు. అజిత్ పవార్ తిరుగుబాటు వెనుక నా హస్తం ఉందని అనడం తప్పు. దీనికి నాకు సంబంధం ఉందనే ప్రశ్నే లేదు. మా కూటమే అధికారంలోకి వస్తుందనే విషయంలో కొంచెం కూడా అనుమానం లేదు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలా చూశాను. కఠిన పరిస్థితులు ఎదురవుతాయి, కానీ అవన్నీ తాత్కాలికమే. రాష్ట్ర ప్రజలు బలంగా నిలబడతారనేది నా అనుభవం."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
అజిత్ పవార్‌ను ఎన్సీపీ నుంచి బహిష్కరించే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు శరద్ పవార్.