ఈ నెల 3న గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమాన శకలాలను మంగళవారం ఐఏఎఫ్ గుర్తించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా పయూమ్ వద్ద కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలు దొరికిన నేపథ్యంలో అందులోని 13 మంది కోసం 'గరుడ దళాల'తో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.
రంగంలోకి ఇస్రో... త్రివిధ దళాలు
గత కొద్ది రోజులుగా భారత వైమానిక దళంతో పాటు, నౌకా, సైనిక దళాలు కూడా ఈ విమానజాడ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇస్రో కూడా రంగంలోకి దిగింది. తాజాగా ఎంఐ-17 హెలీకాప్టర్ అరుణాచల్‌ప్రదేశ్ పయూమ్ పరిధిలో విమానం ఆచూకీని గుర్తించింది. అయితే దట్టమైన అటవీ ప్రాంతం కావడం, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హెలీకాప్టర్ అక్కడ దిగేందుకు అవకాశం లేకపోయిందని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది...
ఎనిమిది రోజుల క్రితం అంటే జూన్ 3 మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఏఎన్-32 విమానం గల్లంతయ్యింది. అది అరుణాచల్ ప్రదేశ్ మెన్చుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకావాల్సి ఉంది. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి 13 మంది ఉన్నారు. తాజాగా విమాన శకలాలను కనుగొన్నారు. అందులోని 13 మంది కోసం.. ప్రత్యేకంగా గరుడ దళానికి చెందిన కమాండోలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసింది ఐఏఎఫ్. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి: రాజ్యసభ నేతగా థావర్ చంద్ గహ్లోత్