సందీప్ ఆర్యా... హరియాణా హిసార్ జిల్లా ఫరిద్పుర్ గ్రామవాసి. ఏకబిగిన 36 గంటల 21 నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగిన ప్రపంచ ఛాంపియన్ పోటీల్లో ఈ రికార్డ్ నెలకొల్పాడు. 36 గంటల్లో 2 లక్షలకు పైగా యోగా ఆసనాలు వేసి... అందరినీ నివ్వెరపోయేలా చేశాడు. ఎక్కువ సమయం పాటు ఆసనాలు వేయడం వల్ల అనేక క్యాలరీల కోల్పోయి... బరువు తగ్గిపోయాడు.
ఈ రికార్డును అమెరికా నుంచి వచ్చిన బృందం రికార్డ్ చేసింది. ఈ పోటీలకు 5 రోజుల ముందు నుంచి కేవలం పండ్ల రసాలే తీసుకున్నాడు ఆర్యా.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆర్యాను.. ఆ రాష్ట్ర ఆయుష్ మంత్రి సత్కరించారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా నుంచి స్ఫూర్తి పొంది... సూర్య నమస్కార ఆసనాలు వేయడం నేర్చుకున్నానని ఆర్యా తెలిపాడు.
అంతకుముందు తన పేరిట ఉన్న రికార్డునే బద్దలుకొట్టాడు ఆర్యా. గతంలో ఏకబిగిన 17 గంటల 30 నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేశాడు.
ఇదీ చూడండి : స్పెయిన్: మ్యాచ్ అనంతరం ఘర్షణ.. 46 మందికి గాయాలు