భాజపా ఎంపీలంతా నిరాశావాదాన్ని వీడి ఆశావహ దృక్పథంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. భాజపా ప్రజాప్రతినిధుల రెండురోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై తమ పార్టీ ఎంపీలకు అవగాహన కల్పించేందుకు శని, ఆదివారాల్లో 'అభ్యాస వర్గ' పేరిట రెండు రోజులు శిక్షణా తరగతులు నిర్వహించింది కమలదళం.
తమకు ఓటేయని వారికి కూడా సేవ చేయగలిగే మనస్తత్వంతో నాయకులంతా మెలగాలని భాజపా నేతలను కోరారు మోదీ. వ్యతిరేక భావనలను వీడి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే తమ తమ నియోజవర్గాలలో పార్టీని బలోపేతం చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ప్రతినెలా విందు...
ప్రజాప్రతినిధులు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని.. రాజకీయాలకతీతంగా దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు ప్రధాని. కేంద్ర మంత్రులు.. పార్టీ ఎంపీలతో ప్రతినెలా విందు సమావేశాలు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో నిర్ణయించారు.
అనంతరం.. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. ప్రతి ఓటరు కనీస అవసరాలను తీర్చగలిగితేనే మరోసారి విజయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: భాజపా ఎంపీలకు నెలనెలా మంత్రుల విందులు!