దక్షిణాది రాష్ట్రం తమిళనాడును ప్రస్తుతం వేధిస్తున్న సమస్య నీటి సంక్షోభం. తాగునీటికే కాదు.. ఇతరత్రా ఏ అవసరానికైనా.. వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు హోటళ్లు, అతిథి గృహాల వరకే ప్రధానంగా ఉన్న ఈ దుస్థితి ఐటీ సంస్థలనూ తాకింది.
సాధారణ అవసరాల కోసం శౌచాలయాల వినియోగానికి నీరు లేక.. ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగుల్ని కోరుతున్నాయి ప్రముఖ ఐటీ సంస్థలు. వాటర్ ట్యాంకర్లూ.. సమస్యను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
శౌచాలయాల వినియోగం కొంతైనా తగ్గించి.. రాష్ట్రాన్ని వేధిస్తున్న నీటి సమస్యను అధిగమించేందుకు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకుంటున్నాయి.
మహాబలిపురం రోడ్లోని.. సిరుసేరి ఐటీ పార్క్ ఉద్యోగుల్ని పీటీఐ సంప్రదించగా ఈ విషయాలు తెలిశాయి.
పదికి రెండు మాత్రమే వాడుకలో..
నీటి సమస్యతో కంపెనీలో బాత్రూంల సంఖ్య తగ్గించారని వెల్లడించారో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒక అంతస్తులో 10 శౌచాలయాలుంటే.. నీటి సంక్షోభంతో రెండు మాత్రమే వినియోగానికి ఉంచుతున్నారన్నారు.
తమ రోజు వారీ కార్యకలాపాలు కొనసాగేందుకు వీలుగా.. ఐటీ కంపెనీలు ఎక్కువగా వాటర్ ట్యాంకర్లనే ఎంచుకోవాల్సి వస్తోందంటేనే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అన్ని విధాల ప్రయత్నాలు...
ఈ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వమూ అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. రాష్ట్ర పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వేలుమణి ఈ సమస్యపై స్పందించారు.
ఇంటి నుంచే పని.. సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. వారి అవసరాల నిమిత్తం వేరే మార్గాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే.. నీటి ఎద్దడి సమస్యతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయన్న నివేదికల్ని ఖండించారు మంత్రి.
నీటిని పొదుపు చేసేందుకు చిన్న, మధ్య తరహా హోటళ్లు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా.. అరటి ఆకులను ఉపయోగిస్తే మంచిదనే పరిష్కారం సూచించారు వేలుమణి.
హోటళ్లు, మాన్షన్లు తాత్కాలిక మూసివేత..
ట్రిప్లికేన్ ప్రాంతంలో ఇప్పటికే నీటికొరతతో కొన్ని విలాసవంతమైన హోటళ్లు, మాన్షన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఐటీ సంస్థలు క్యాంటీన్లనూ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో వర్షాలు లేక పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటి కోసం చేతిపంపులు, వాటర్ట్యాంకర్ల వద్ద ప్రజలు గుమికూడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సమస్యను ఎలాగైనా తీర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరసనలతో ధర్నాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: