మద్యం ప్రియులు ఎక్కువగా ఉన్న దేశాల్లో.. భారత్ ముందు వరుసలో ఉంది. మద్యం సేవించే వారి సంఖ్య దేశంలో అంతకంతకూ పెరిగిపోతోందని 'కమ్యునిటీ ఎగైనెస్ట్ డ్రంకన్ డ్రైవింగ్ (సీఏడీడీ)' సర్వేలో తేలింది. దేశంలో మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది.
పెరుగుతున్న సంపద, ఆకాంక్షలు, సామాజిక ఒత్తిడి, విభిన్న జీవనశైలిని కోరుకోవడం వంటి అంశాలు మహిళలను మద్యం వైపు ప్రేరేపిస్తున్నాయని సీఏడీడీ సర్వే తెలిపింది. దేశ రాజధాని దిల్లీలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల 5వేల మంది మహిళలపై సర్వే నిర్వహించి ఈ వివరాలను నివేదించింది.
'మద్యం సేవించే మహిళలు పెరిగిపోతున్నారు. మహిళలు మద్యాన్ని ఎక్కువ సేవిస్తున్నారు' అని సర్వే పేర్కొంది.
సంప్రదాయానికి చెల్లు
దశాబ్దాల కాలంగా మహిళలు మద్యానికి దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో.. వచ్చే ఐదేళ్లలో మద్యం సేవించే మహిళల సంఖ్య 25 శాతం పెరుగుతుందని సర్వే అంచనా వేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2010- 2017 మధ్య కాలంలో మద్యం వినియోగం 38 శాతం వృద్ధి చెందింది. 2005లో సగటున ఒక్కరు.. ఏడాదికి 2.4 లీటర్ల మద్యాన్ని సేవిస్తుండగా... 2016కు 5.7 లీటర్లకు చేరిందని సర్వే ప్రకటించింది.
నిరాశ, ఒంటరితనం, ఆందోళన, బాధ, మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించడానికి మహిళలు మద్యాన్ని ఉపశమన మార్గంగా ఎంచుకుంటున్నారని సర్వే తెలిపింది.
- 18-30 ఏళ్ల మధ్య మహిళల్లో 43.7 శాతం మంది అలవాటు లేకపోయినా మద్యాన్ని సేవిస్తున్నారు.
- 31-45 ఏళ్ల మధ్య మహిళల్లో 41.7 శాతం మంది వృత్తిని బట్టి మద్యానికి అలవాటు పడుతున్నారు.
- 60 ఏళ్లకు పైబడిన 53 శాతం మంది, 46-60 ఏళ్ల మధ్య మహిళలు భావోద్వేగాల కారణంగా మద్యం సేవిస్తున్నారు.
మహిళలు వారానికి 8 నుంచి 10కి మించి డ్రింక్స్ సేవిస్తే హానికరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రోజుకు రెండు డ్రింక్స్‌కి మించి తాగడం మంచిది కాదని పేర్కొంది. గర్భవతిగా ఉన్న మహిళలు మద్యానికి దూరంగా ఉండాలని సూచించింది.
ఇదీ చూడండి: గొలుసు దొంగకు బడిత పూజ చేయించిన మహిళ..!