హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం పేరుకుపోయి రాష్ట్రంలోని 800కుపైగా రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. జనవరి 13 నుంచి 16 వరకు భారీ వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
స్తంభించిన జనజీవనం
మంచు భారీగా పేరుకుపోవటం వల్ల చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. నీరు, విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. త్వరలోనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నా.. సమస్య జటిలంగానే ఉంది.
యంత్రాల లేమి
రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు సరైన ఆధునిక పరికరాలు లేని కారణంగా రహదారుల నిర్వహణ కష్టంగా మారుతోంది. అందుబాటులో ఉన్న వివిధ యంత్రాలతో నామమాత్రంగా మంచును తొలగిస్తున్నారు అధికారులు.
ప్రతి శీతకాలంలో హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తుంది. అటువంటి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క మంచు తొలగించే ఆధునిక యంత్రం లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఏడాది ఈ యంత్రాలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర సీఎస్ అనిల్ కుమార్ పేర్కొన్నారు.