మూగజీవాలు అప్రయత్నంగా చేసే కొన్ని పనులు మానవాళికి అనేక జీవిత సత్యాలు బోధిస్తాయి. వాటిలో సాహసాలు కొన్నైతే.. తుంటరి చేష్టలు ఇంకొన్ని. అలాంటి వైవిధ్యభరితమైన వన్యజీవులు.. అవి చేసిన పనులు ఏమిటో ఇప్పుడు చూద్దామా..!
ఆర్టీఓ అధికారిగా గజరాజు
ఇప్పటికే వాహనదారుల నుంచి టోల్‌ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్ అంటూ అధికారులు వసూలు చేస్తుంటే.. తన ఇలాకలోకి వచ్చిన వాహనాల వద్ద ఈ ఏనుగు కొత్తరకం పన్ను వసూలు చేస్తోంది. ఆ ప్రాంతానికి తానేదో ఆర్టీఓ అధికారిగా భావించి చెరకు లోడుతో వచ్చిన ట్రక్కులను ఆపి మరీ తనకు కావాల్సిన తీయని గడలను ఈ గజరాజు ఆరగించింది.
చిరుతతో కయ్యానికి దిగిన కప్ప
'పిట్టకొంచెం కూత ఘనం..' అనే సామెత సరిపోతుంది ఈ కప్పకి. అసలే ఆకలి మీద ఉన్న చిరుతను ఎలా బెదిరిస్తోంది చూడండి. 'నా దారికి అడ్డులే' అంటూ చిరుత ఒక్కటిచ్చినా ఈ మొండి కప్ప అడ్డు తొలగలేదు. పైగా ఒక అడుగు ముందుకేసి చిరుతనే బెదిరించింది. పాపం ఆ చిరుత.. కప్పను ఏమీ చేయలేక వెనుదిరిగింది.
ఓ ఇంటిలో సరకుల సంచితో ఉడాయించిన ఏనుగు
లాక్‌డౌన్ కష్టాలు మనుషులకే కాదండోయ్.. జంతువులకు కూడా ఉంటాయి. ఈ గజరాజును చూస్తే నిజమే అనిపిస్తోంది. తొండంతో నిండుగా ఉన్న సరకుల మూటను తీసుకెళ్తోంది. వీటితో లాక్‌డౌన్ కష్టాలు తీరుతాయని అనుకుంటుందో ఏమో.! ఇలాంటి తుంటరి పనినే సముద్రతీరంలో బీచ్‌లో ఓ సీల్ చేసింది. లాక్‌డౌన్ వల్ల ఆ సీల్‌కు స్వేచ్ఛ లభించినట్లయింది. అందుకే పర్యటకులు సేద తీరే పడకమీద ఎంచక్కా మెలికలు తిరుగుతూ విశ్రాంతి తీసుకుంది.