రైతులకు మద్దతుగా శనివారం చేపట్టాలనుకున్న నిరశన దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఉపసంహరించుకోవడాన్ని శివసేన పార్టీ ఖండించింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమంపై ఆయన వైఖరి ఏంటో తెలియదంటూ పార్టీ అధికారిక ప్రతిక సామ్నాలో విమర్శించింది.
"అన్నా రైతు ఉద్యమానికి మద్దతుగా నిలబడినట్లు అనిపించింది. కానీ ఆయన వెనక్కి తగ్గారు. ఇంతకీ ఆయన వైఖరి ఏంటో తెలియడం లేదు. వ్యవసాయ చట్టాల గురించి నిజంగా ఆయన ఏమనుకుంటున్నారు. దిల్లీ శివారుల్లో పోరాడుతున్నవారికి నిజంగా ఆయన మద్దతు ఉందా? ఇంతకీ ఆయన ఎవరితో ఉన్నారు? కనీసం ఆ విషయాన్ని మహారాష్ట్రనైనా తెలుసుకోనివ్వండి"
- శివసేన( సామ్నా పత్రికలో)
'సరిహద్దులో వయసు మీద పడిన రైతులు నిరసనలో పాల్గొంటున్నారు. అన్నా వారికి అండగా నిలవాలి. రాలేగావ్ సిద్ధిలో ఉండి భాజపాకు అనుకూలంగా వ్యవహరించడంలో అర్థం లేదు' అని విమర్శించింది. అలాగే ఉద్యమ ప్రారంభ సమయంలో హజారే మద్దతు ప్రకటన నుంచి రైతులు ధైర్యం కూడగట్టుకున్నారని గుర్తు చేసింది. మరోవైపు, రైతులపై కఠినంగా వ్యవహరిస్తోన్న కేంద్రంపై శివసేన మండిపడింది. 'రైతుల ఉద్యమాన్ని కేంద్రం నీరుగార్చాలనుకుంటోంది. వారు అంతర్జాతీయ నేరగాళ్లు అన్నట్లు చూస్తోంది' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: మోదీ పథకాల కోసం మహిళ ట్రక్ రైడ్