కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగా వివిధ దేశాలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. టీకా సరఫరాపై అంతర్జాతీయ వేదికగా భారత ప్రధాని ఇచ్చిన హామీని డబ్ల్యూహెచ్‌ఓ కొనియాడింది. కరోనా పోరులో భారత్ నిబద్ధతకు ధన్యవాదాలు తెలిపారు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్.
ప్రపంచ శ్రేయస్సు కోసం మన దగ్గరున్న శక్తులను, వనరులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే ఈ మహమ్మారికి ముగింపు పలకగలమని వెల్లడించారు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్. వ్యాక్సిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారత్, ప్రపంచదేశాలకు సహాయపడుతుందని మోదీ ఇచ్చిన హామీని స్వాగతించారు.
ఇదీ చూడండి: ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ
అంతకుముందు ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మానవాళికి సహాయపడటానికి భారత్.. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తుందని ఐక్యరాజ్య సమితి 75వ సర్వసభ్య సమావేశం వేదికగా ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సిన్ ప్రయోగాలు మూడోదశకు చేరుకున్నాయని తెలియజేశారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారత ఔషధ పరిశ్రమ 150 దేశాలకు అత్యవసర మందులు పంపించిందని గుర్తు చేశారు.
ఇదీ చూడండి: ఐరాసలో సంస్కరణలు రావాల్సిందే: నరేంద్ర మోదీ