ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పశ్చిమ, దక్షిణ భారతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో వరదల ఉగ్రరూపానికి ఇప్పటివరకు 183 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కేరళలోనే 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 58 మంది ఆచూకీ గల్లంతయ్యింది.
కర్ణాటకలో భయానకం..
కర్ణాటకలో వరద పరిస్థితి భయానకంగా ఉంది. ఆదివారం ఒక్కరోజే 9 మంది ప్రాణాలుకోల్పోయారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 40కి చేరింది. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది.
5.82 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న 50,595 పశువులను కాపాడినట్లు ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. రాష్ట్రానికి సుమారు రూ.40వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.3వేల కోట్లు విడుదల చేయాలని యడియూరప్ప అభ్యర్థించారు.
'మహా' కష్టాలు
మహారాష్ట్రలో వరదలు తగ్గుముఖం పట్టాయి. వర్షాల బీభత్సానికి రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లింది. ఇప్పటివరకూ 40 మంది మృతిచెందారు. 4లక్షల మంది సర్వం కోల్పోయారు. సుమారు 5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద పీడిత సంగ్లీ, కొల్హాపుర్ జిల్లాల్లోనే 4.04 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆర్మీ, కోస్ట్‌గార్డు, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 105 బృందాలతోపాటు పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
గుజరాత్‌లో బీభత్సం
గుజరాత్‌లో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఆదివారం ఒక్కరోజే వర్షాలు, వరదలకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 31కి చేరింది. 10 మంది మత్స్యకారులు సహా 12 మంది ఆచూకీ గల్లంతైంది.
సోమవారమూ సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.