విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాల తొలగింపులో ఫేస్బుక్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని వచ్చిన ఆరోపణలను భారత్‌లో ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తోసిపుచ్చారు. పారదర్శకమైన, పక్షపాత రహిత, సామాజిక మాధ్యమ వేదికగానే ఫేస్బుక్ ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న సందేశాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉన్నామన్నారు. ఈ విషయంలో రాజకీయ పక్షాలకు చెందిన ప్రముఖులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పారు.
భారత ప్రజాస్వామ్య బహుళత్వ వాదానికి ఫేస్బుక్ కట్టుబడి ఉందని, ప్రజలందరూ తమ అభిప్రాయాలను ఫేస్బుక్ వేదికగా స్వేచ్ఛగా వెల్లడించవచ్చని శుక్రవారం.. బ్లాగ్‌లో పోస్ట్ చేశారు అజిత్. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 2.25కోట్ల విద్వేషపూరిత సందేశాలను తొలగించామన్నారు. 2017 చివరి త్రైమాసికంలో ఇలా తొలగించిన వాటి సంఖ్య 17లక్షలని తెలిపారు.
భారత్‌లో ఫేస్బుక్ ఓ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించిందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వార్తా కథనం వచ్చిన నేపథ్యంలో ఆ సామాజిక మాధ్యమ వేదికకు పార్లమెంటరీ కమిటీ(ఐటీ) సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 2న కమిటీ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొంది.