తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ నెలకొల్పనున్న పార్టీతో పొత్తుపై మక్కల్ నీదు మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ స్పందించారు. రజనీతో పొత్తు పెట్టుకోవడానికి ఫోన్‌కాల్ దూరమే ఉందన్న కమల్.. తామిద్దరు మంచి స్నేహితులుగా చెప్పుకొచ్చారు.
సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటే కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 'సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటే కలిసి పనిచేయడానికి సిద్ధం. అదేవిధంగా ఆ సిద్ధాంతాలు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. అలా ఉంటే భేషజాలకు పోకుండా పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం' అని కమల్ స్పష్టం చేశారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై ఎదురుచూపులకు ఇటీవలే తెరపడింది. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ పెట్టబోతున్నానని, ఇందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ఇటీవల ఆయన అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 'మక్కల్ సేవై కట్చి'గా రజనీ పార్టీ పేరు ఎన్నికల సంఘంలో నమోదు చేసినట్లు, ఆయనకు ఈసీ ఆటో గుర్తు కేటాయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆ వార్తల్ని రజనీ వర్గీయులు ధ్రువీకరించలేదు.
ఇవీ చూడండి: మద్యం అమ్మకాలపై కమల్ కీలక హామీ