సైకిల్ అంటే సాధారణంగా రెండు పెడళ్లు ఉంటాయి. ఒకరు నడిపితే.. ఇంకొకరు వెనుక కూర్చునే వీలుంటుంది. అయితే ఇందుకు విభిన్నంగా ఆలోచించారు కర్ణాటక బళ్లారిలోని రావ్ బహదూర్ కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు. వినూత్నంగా ఆలోచించి అద్భుత ఆవిష్కరణ చేశారు. ఆరు పెడళ్లతో, ఆరుగురు ఒకేసారి నడపగల సైకిల్‌ను రూపొందించి అబ్బురపరిచారు. హంపీ పర్యాటకాన్ని మరింత సులభతరం చేశారు.
కళాశాలకు చెందిన 8 మంది మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల బృందానికి ఎస్వీ శరణ్‌గౌడ, శ్రీకాంత్ నేతృత్వం వహించారు. ఈ నూతన సైకిల్‌కు ఎలాంటి బ్యాటరీలు, ఇంజిన్ ఉండవు. పర్యావరణ కాలుష్యం జరిగే అవకాశం లేదు.
ఒకేసారి ఆరుగురు ఈ సైకిల్‌ను నడిపే అవకాశం ఉంది. పూర్తి పర్యావరణ అనుకూలమైన ఈ సైకిల్ రూపొందించడానికి వారికి రూ.50 వేలు ఖర్చయింది.
హంపీని చుట్టేద్దాం
కర్ణాటకలోని హంపీ ప్రసిద్ధ పర్యటక స్థలం. ఇక్కడి పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు దేశ, విదేశీ పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో రహదారులు ఇరుకుగా ఉంటాయి. అందువల్ల మోటారు వాహనాలతో ప్రయాణించడం కష్టం. వీటిని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ, పర్యాటక అనుకూలమైన సైకిల్‌ను రూపొందించారు ఈ యువ ఇంజినీర్లు.
ఇదీ చూడండి: తేజస్వీ ఆచూకీ చెబితే రూ.5100 బహుమతి..!